
తెలుగు సినీ ప్రేక్షకులను తనదైన కామెడీతో అలరించిన నటీమణుల్లో గీతా సింగ్ ఒకరు. ముఖ్యంగా అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో కమెడియన్‌గా, సహాయ నటిగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే తెరపై నవ్వులు పంచిన గీతా సింగ్ నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. సినిమాల్లో కామెడీ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గీతా సింగ్‌కు ఒకప్పుడు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే తనకు ఎదురైన కొన్ని అనుభవాలు మాత్రం ఎంతో బాధించాయని ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఓ స్టార్ డైరెక్టర్ టీమ్‌కు సంబంధించిన కో-డైరెక్టర్ల వల్ల తాను ఇబ్బంది పడ్డానని వెల్లడించారు. ఓ సినిమాలో మంచి పాత్ర ఉందంటూ కొందరు కో-డైరెక్టర్లు తనను సంప్రదించారని గీతా సింగ్ తెలిపారు. ఆ పాత్ర మాస్ మహారాజా రవితేజ పక్కన ఉండే కీలకమైన క్యారెక్టర్ అని చెప్పడంతో తాను ఎంతో సంతోషించానని పేర్కొన్నారు. ఆ సినిమా చేయాలనే ఆసక్తితో ఏకంగా నెల రోజుల పాటు తన డేట్స్‌ను కూడా సర్దుబాటు చేసుకున్నానని చెప్పారు. అంతేకాదు, ఆ సినిమా కోసం ఇతర అవకాశాలను సైతం వదులుకున్నానని వివరించారు.
ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోప్ హీరోయిన్.. హీరోలకు మించి క్రేజ్
అయితే షూటింగ్ సమయం దగ్గరపడుతున్నా చిత్రబృందం నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదని గీతా సింగ్ వెల్లడించారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి కో-డైరెక్టర్లకు ఫోన్ చేసినా వారు స్పందించలేదని తెలిపారు. మొదట ఏదో పొరపాటు జరిగి ఉంటుందని భావించి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. కానీ సినిమా విడుదలైన తర్వాత థియేటర్‌కు వెళ్లి చూసినప్పుడు తనకు చెప్పిన పాత్రలో మరో నటి కనిపించడంతో షాక్‌కు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా మరో నటితో ఆ సన్నివేశాలను చిత్రీకరించడం బాధ కలిగించిందని అన్నారు. ఒక నటిగా తనకు తగిన గౌరవం ఇవ్వలేదని, తన విలువైన సమయాన్ని వృథా చేశారని వాపోయారు.
చిరు, బాలయ్యల, నాగ్, వెంకీలతో బ్లాక్ బస్టర్స్.. కట్ చేస్తే సినిమాలకు దూరం.. ఇప్పుడు ఇలా
గీతా సింగ్ వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. సొంతవారి వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఎంతో ప్రేమగా పెంచుకున్న కుమారుడు ప్రమాదంలో మరణించడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది. ఇటీవలి కాలంలో మళ్లీ సోషల్ మీడియాలో కనిపిస్తూ, ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తెరపై ప్రేక్షకులను నవ్వించిన గీతా సింగ్.. నిజ జీవితంలో ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం గురించి తెలుసుకున్న అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.