
బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు ఢిల్లీ హైకోర్టు నుండి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. తన అనుమతి లేకుండా పేరు, గొంతు, రూపురేఖలు (పర్సనాలిటీ రైట్స్) వాడుకుంటున్నారంటూ ఆయన వేసిన పిటిషన్‌పై విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ సమయానికి సెటిల్మెంట్ పూర్తికాకపోతే.. వచ్చే విచారణకు స్వయంగా అమితాబే కోర్టుకు హాజరుకావాలని జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ స్పష్టం చేశారు.
అసలేం జరిగింది?
2022లో అమితాబ్ తన పర్సనాలిటీ, పబ్లిసిటీ హక్కుల రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు. లాటరీ స్కీమ్‌లు, వ్యాపారాలు, డిజిటల్ ఉత్పత్తుల్లో తన వాయిస్, ముఖ చిత్రాన్ని అక్రమంగా వాడకుండా అప్పట్లోనే ‘ఎక్స్ పార్టే’ అజమాయిషీ ఉత్తర్వులు పొందారు. అయితే, కొందరు ప్రతివాదులతో రచ్చ లేకుండ మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని చూశారు. ఒప్పందం దాదాపు ఖరారైనప్పటికీ.. బిగ్ బి వైపు నుంచి లాజిస్టికల్ కారణాల వల్ల సంతకాలు జాప్యమయ్యాయి.
నవంబర్ 16న బిగ్ డే..
ఈ జాప్యంపై సీరియస్ అయిన కోర్టు.. ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి సమయమిస్తూ తదుపరి విచారణను నవంబర్ 16, 2026కి వాయిదా వేసింది. అయితే ఒకవేళ ఒప్పందం పూర్తిగా ముగియకపోతే.. సీపీసీ (Code of Civil Procedure), కొత్త భారతీయ సాక్ష్య అధినియమ్, 2023 నిబంధనల ప్రకారం అమితాబ్‌ను నేరుగా ప్రశ్నించేందుకు ఆయన ప్రత్యక్షంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని కండీషన్ పెట్టింది.
సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగులతో కోర్టు సీన్లను రక్తికట్టించే బిగ్ బీ.. నిజ జీవితంలో ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కుతారా? లేక నవంబర్ 16 లోపే లీగల్ డీల్ ముగించి వివాదానికి ఫుల్‌స్టాప్ పెడతారా? అనేది ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు వ్యాపార, న్యాయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.