Reading Time: 2 minutes
Ap Local Body Elections Bc Reservation Quota And Seat Details

AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లను ఖరారు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు సుమారు 28 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, మిగిలిన 6 శాతం వరకు కూటమి పార్టీలు తమ పార్టీ పరంగా కేటాయించాలని నిర్ణయించింది.. గ్రామీణ స్థానిక సంస్థల్లో భాగంగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి మొత్తం 1,33,910 సీట్లలో 30,315 స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు.. రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు సంబంధించి 3,128 స్థానాలను బీసీలకు కేటాయించనున్నారు.

ఇక, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) విషయానికి వస్తే, మొత్తం 9,913 స్థానాల్లో 2,400 స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు. మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) పదవులకు సంబంధించి మొత్తం 661 స్థానాల్లో 152 స్థానాలు బీసీలకు దక్కనున్నాయి. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీ) విషయంలోనూ మొత్తం 661 స్థానాల్లో 152 స్థానాలను బీసీలకు కేటాయించనున్నట్లు వివరాల్లో పేర్కొన్నారు. మరోవైపు.. జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 స్థానాల్లో ఏడు స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు. దీంతో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా పరిషత్ స్థాయి వరకు బీసీలకు ప్రాతినిధ్యం కల్పించేలా రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

పట్టణ స్థానిక సంస్థల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కేటాయించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మొత్తం 3,884 వార్డు స్థానాలకు గాను 1,273 స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులకు సంబంధించి మొత్తం 106 స్థానాల్లో 35 స్థానాలను బీసీలకు కేటాయించనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవుల విషయంలో మొత్తం 17 స్థానాల్లో ఆరు స్థానాలను బీసీలకు రిజర్వు చేయాలని నిర్ణయించినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇది 35.29 శాతానికి సమానమని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించి, బీసీ కుల సంఘాలు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా కేబినెట్ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు, తుది జాబితా వెలువడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై తదుపరి స్పష్టత రానుంది.