Reading Time: < 1 minute

ఢిల్లీలో హై టెన్షన్.. కేజ్రీవాల్, మమతా బెనర్జీ అరెస్ట్.. పోలీసులపై రాళ్ల దాడి

Caption of Image.

న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతుంది. జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, సీజేపీ ప్రొటెస్ట్‎కు అనుమతి లేదంటూ నిరసనకారులను ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. 

ఈ క్రమంలో కన్నాట్ ప్లేస్, ఆకాశవాణి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జంతర్ మంతర్ ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఇద్దరు పోలీస్ సిబ్బంది గాయపడ్డట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. 

కన్నాట్ ప్లేస్, ఆకాశవాణి భవన్ దగ్గర పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వెళ్లే అన్ని మార్గాలను క్లోజ్ చేసి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తీవ్ర నిర్బంధం ఉన్న నిరసనకారులు ధైర్యంగా రోడ్లపైకి వస్తున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు్న్నారు. సీజేపీ నిరసన నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో ఇప్పటికే పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేశారు. 

ప్రజా రవాణా వ్యవస్థలను నిలిపివేయడంతో పాటు మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మరోవైపు జంతర్ మంతర్ దగ్గర బొద్దింక జనతా పార్టీ చేపట్టిన నిరసనలో పాల్గొంటారనే అనుమానంతో ఢిల్లీలోని లోధి ఎస్టేట్ వెలుపల ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులను నిర్భందించారు. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీని సైతం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

©️ VIL Media Pvt Ltd.