
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ…? ఆ లక్కీ లీడర్ ఎవరు…? స్వయంగా సీఎం నోటి నుంచే ఆ మాట వచ్చింది కాబట్టి… స్టేట్‌లో పెద్దల సభకు వెళ్ళే అదృష్టం ఎవరికి దక్కబోతోంది? ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో ఈ సబ్జెక్ట్ మీద హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రత్యేకించి పద్మశాలి సామాజికవర్గం నేతలైతే ఆల్రెడీ ట్రయల్స్‌లో ఉన్నారట. ఆ సామాజికవర్గానికి, ఎమ్మెల్సీకి ఏంటి సంబంధం? రేస్‌లో ఉన్న ఫేస్‌లేవి?. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లలో నిర్వహించిన సభ తాలూకా పొలిటికల్ హీట్…. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంతకంతకూ పెరుగుతోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన నాయకుడిని ఎమ్మెల్సీని చేస్తామని ఆయన ప్రకటించడంతో … ఆ లక్కీ లీడర్ ఎవరన్న రాజకీయ చర్చలు యమా ఇంట్రస్టింగ్‌గా జరుగుతున్నాయి. మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత సమీకరణల్లో భాగంగా… అదే సామాజికవర్గానికి చెందిన గుండు సుధారాణికి నామినేటెడ్ పోస్టు దక్కింది. ఇప్పుడు పెద్దల సభకు కూడా ఒకర్ని పంపిస్తామని సాక్షాత్తు సీఎం చెప్పడంతో… కాంగ్రెస్‌లోని పద్మశాలి నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ఆశావహులు పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయిపోయారట.
ఈ రేసులో బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె వాణి పేరు కూడా తెరపైకి వచ్చింది. టైం గడిచేకొద్దీ.. మరికొందరు కూడా రేస్‌లోకి రావచ్చని అంటున్నారు. నల్గొండ నుంచి ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఎక్కువ పదవులు దక్కాయన్న అభిప్రాయం ఉండటంతో… బ్యాలెన్స్ చేసే క్రమంలో తనకు ఎమ్మెల్సీ ఇస్తారంటూ లెక్కలేసుకుంటున్నారట డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత. అయితే ఆయనకు జిల్లాలోని కొందరు సీనియర్లతో సఖ్యత లేకపోవడం అడ్డంకి కావచ్చన్నది మరో వెర్షన్. ఇక బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్ విషయానికి వస్తే…గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదన్న అసంతృప్తి ఉంది ఆయనకు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని అప్పట్లోనే చెప్పారట. నాటి నుంచి నమ్మకం పెట్టుకున్న ఈరవత్రి ఇప్పుడు సీఎం ప్రకటన తర్వాత ఆల్రెడీ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఇక సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అయితే…. సీట్ నాకు గాక ఇంకెవరికి అంటూ లెక్కలేసుకుంటున్నారట. సిరిసిల్లలో చేనేత సామాజిక వర్గానికి చెందిన వారే అధికంగా ఉండటంతో…వారిని ప్రసన్నం చేసుకుంటే చాలు… పాగా వేయడం నల్లేరుమీద నడకేనన్న విషయాన్ని సీఎం గుర్తించారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది.
లోకల్‌గా కేటీఆర్‌ని ఢీ కొట్టాలన్నా…. అధికారులు కాంగ్రెస్ నాయకుల మాట వినాలన్నా… ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధి ఇక్కడి నుంచి ఉండాల్సిందేనన్నది కాంగ్రెస్ పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వేములవాడ నుంచి ప్రాతినిధ్యంవహిస్తున్న ఆదిశ్రీనివాస్ ద్వారానే సిరిసిల్లలో అధికారిక కార్యక్రమాలు చేస్తున్నారు హస్తం నేతలు. కానీ… ఇటు పోలీసులు కానీ, అటు పాలనా యంత్రాంగంగానీ పూర్తిగా దారికి రావాలంటే సిరిసిల్ల నియోజకవర్గం వ్యక్తికే ఎమెల్సీ పదవి ఉండాలన్న మాటలు వినిపిస్తున్నాయి.ఈ సమీకరణలన్నీ తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారట సంగీతం శ్రీనివాస్. గతంలోనూ సిరిసిల్ల నుంచి ఎమ్మెల్సీ ప్రస్తావన వచ్చినప్పటికీ వర్కౌట్ అవలేదు.పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారని అప్పట్లో ప్రచారం సాగింది.. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమీకరణలతో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు కూడా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్లు రెడ్లకే ఇచ్చినందున కేకేకు ఈసారి కూడా ఎమ్మెల్సీ యోగం ఉండకపోవచ్చన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం.
అయితే ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మహేందర్‌రెడ్డికి గౌరప్రదమైన పదవి ఇవ్వాలని.. అదికూడా రాష్ట్ర స్థాయి పోస్టు అయితే బాగుంటందనే యోచనలో పార్టీ పెద్దలున్నారట. ఆయన్ని ఉమ్మడి జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ చేసి… రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ బాధ్యతలు అప్పగించవచ్చన్నది లేటెస్ట్ టాక్. మరోవైపు పది రోజులకో మంత్రి సిరిసిల్లలో పర్యటిస్తారని సీఎం చెప్పినందున అక్కడ రాజకీయంగా చాలా మార్పులు రావచ్చని అంటున్నారు. ఆ స్పీడ్‌ను అందుకుని.. పరుగులు పెట్టగలిగిన లీడర్‌ని ప్రొజెక్ట్ చేయాలనే యోచనలో ఉన్నారట పార్టీ పెద్దలు. అదే జరిగితే సిరిసిల్లలో బీసీ నేతకు ఇంచార్జ్ పదవి ఇవ్వడం లాంఛనమేనని అంటున్నారు పరిశీలకులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ని ఎదుర్కొనే లీడర్ ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉండాలన్నది పార్టీ ముఖ్యుల అభిప్రాయంగా తెలుస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు సిరిసిల్లలో పట్టు సాధించాలంటే అధికారం ఉన్నప్పుడే లోకల్ నేతను బలంగా తయారు చేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు కూడా డిసైడ్ అయ్యారట. అయితే… ఇన్ఛార్జ్ పదవి వేరే వారికి ఇచ్చేందుకు, టెస్కాబ్ చైర్మన్ పదవి తీసుకునేందుకు కేకే మహేందర్‌రెడ్డి అంగీకరిస్తారా? అన్నది ఇక్కడ కీలకం. అదే సమయంలో… రాష్ట్ర స్థాయి సమీకరణాల్లో భాగంగా సిరిసిల్ల పద్మశాలికి ఎమ్మెల్సీ పదవి దక్కకపోతే…. లోకల్‌గా పరిస్థితి ఎలా ఉంటుంది..? ఆ సామాజికవర్గాన్ని ఎలా సంతృప్తి పరుస్తారన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.