
మహారాష్ట్రలోని పాల్గర్ లో రెండు ఇళ్ల మధ్యలో చిక్కుకున్న 70 ఏళ్ళ వృద్ధుడిని వీరోచితంగా రక్షించారు ఫైర్ సిబ్బంది. శనివారం ( అక్టోబర్ 3 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. శనివారం తెల్లవారుజామున నవ్లీ లోని భీమాయ్ నగర్ లో జరిగింది ఈ ఘటన. పాల్గర్ కు చెందిన వినోద్ విష్ణు జాదవ్ అనే 70 ఏళ్ళ వృద్ధుడు రెండు ఇళ్ల మధ్య ఒక అడుగు కన్నా తక్కువ వెడల్పు ఉన్న సందులో ఇరుక్కుపోయాడు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని అతికష్టమైన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వృద్ధుడిని సురక్షితంగా బయటికి తెచ్చారు. ఫైర్ సిబ్బంది చేపట్టిన ఆపరేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు స్థానికులు.
మొదట రెండు గోడల మధ్య అడుగు మేర కూడా సందు లేకపోవడం గమనించి ఈ ఆపరేషన్ సాధ్యం కాదని భావించారు. ఆ తర్వాత ఇంటి గోడను కొంచెం పగలగొట్టి సందులోకి వెళ్లారు రూట్ ఏర్పాటు చేసుకున్నారు.
పగులగొట్టిన గోడ ద్వారా ఇరుకైన సందులోకి వెళ్లిన ఫైర్ సిబ్బంది వృద్ధుడిని సురక్షితంగా బయటికి తెచ్చారు. అనంతరం వృద్ధుడిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. విజయవంతంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఫైర్ సిబ్బందికి కృతఙ్ఞతలు తెలిపారు బాధితుడి కుటుంబసభ్యులు.