Reading Time: 2 minutes

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో బయటపడ్డ మరో సంచలన విషయం.. అందరూ కలిసే కుట్ర చేశారా..?

Caption of Image.

న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పైలట్‎పై దాడి చేసి విమానాన్ని కూల్చేయడానికి ప్రయత్నించిన కో పైలట్‎ను విడిచిపెట్టాలని ఫ్లైదుబాయ్ సిబ్బంది డిమాండ్ చేశారని ఆ విమానంలో ప్రయాణించిన ఇద్దరు ఇజ్రాయెల్ ప్రయాణికులు ఆరోపించారు. త్స్వికా మానేస్, డేనియల్ ష్లిక్టర్ అనే ఇజ్రాయెల్ ప్రయాణికులు అంతర్జాతీయ మీడియాతో ఈ వివరాలను పంచుకున్నారు. 

‘‘పైలట్‎పై దాడి చేసి విమానాన్ని క్రాష్ చేయడానికి ప్రయత్నించిన కో పైలట్‏ను మేం అదుపులోకి తీసుకుని బంధించాం. అయితే, అతడిని విడిచిపెట్టాలని ఫ్లైదుబాయ్ విమాన సిబ్బంది మాతో వాగ్వాదానికి దిగారు. కానీ మేం అతడిని విడిచిపెట్టకుండా అలాగే బంధించాం. ప్రయాణికులు కాక్ పిట్ నుంచి వెళ్లిపోవాలని విమాన సిబ్బంది డిమాండ్ చేశారు. 

కానీ సిబ్బంది ప్రవర్తనపై అనుమానంతో వారిని వెనుక సీట్లలో కూర్చోబెట్టి కాక్‌పిట్ వద్ద భద్రతగా నిలిచాం. అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు రిజర్వ్ పైలట్లు కాక్‌పిట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయం లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మేం కో పైలట్‎ను చంపాలనుకోలేదు. విచారణ కోసం అతను బ్రతకాలని కోరుకున్నాం’’ అని మానేస్, ష్లిక్టర్ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. 

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నందున తమ సిబ్బంది ప్రవర్తనపై వ్యాఖ్యానించడానికి ఫ్లైదుబాయ్ నిరాకరించింది. తాము దర్యాప్తు అధికారులకు సహకరిస్తున్నామని, అధికారులు, నియంత్రణ సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపింది. విమానాన్ని క్రాష్ చేయడానికి ప్రయత్నించిన కో పైలట్‎కు ఫ్లైదుబాయ్ సిబ్బంది ఎందుకు మద్దతుగా నిలిచారనేది కొత్త చర్చకు దారి తీసింది. ఈ ఘటనలో ఫ్లైదుబాయ్ సిబ్బంది ప్రమేయం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే..?

బుధవారం (సెప్టెంబర్ 30) ఆకాశంలో సినీ రేంజ్లో హైడ్రామా నడిచింది. ఫ్లైదుబాయ్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా కాక్ పిట్లో పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. పైలట్ స్మిత్ మచ్చర్‏పై కో పైలట్ కత్తితో దాడి చేశాడు. పైలట్ల మధ్య ఘర్షణతో విమానం అదుపు తప్పింది.

విమానం ఆకాశంలో కేవలం 30 సెకన్లలోనే దాదాపు 14 వేల నుంచి 17 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. కాక్ పిట్ నుంచి అరుపులు వినిపించడం, విమానం ఆకస్మాత్తుగా ఎత్తు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోనకు గురయ్యారు. ఈ క్రమంలోనే కొందరు పైలట్లు ధైర్యంగా కాక్‏పిట్ డోర్ బద్దలుకొట్టి పైలట్పై దాడి చేసిన కో పైలట్ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్ల (ఆన్-డ్యూటీ సిబ్బంది) సహాయంతో విమానాన్ని ఈశాన్య సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే సౌదీ పోలీసులు కో పైలట్ను అరెస్ట్ చేశారు. గాయపడ్డ పైలట్ స్మిత్ మచ్చర్ కు అబుదాబిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు యూఏఈ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ఫ్లెదుబాయ్ విమాన ఘటనను ఉగ్రవాద చర్యగా ప్రకటించింది.

©️ VIL Media Pvt Ltd.