Reading Time: 2 minutes

యూఎల్సీ దరఖాస్తులకు లైన్ క్లియర్ .. పెండింగ్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు సర్కారు ఓకే

Caption of Image.
  • 22ఏ చిక్కుముడులు ఒక్కొక్కటిగా విప్పుతున్న ప్రభుత్వం
  • యుద్ధప్రాతిపదికన పరిశీలించి ఓకే చేయాలన్న మంత్రి
  • గత ప్రభుత్వం జీవో ఇచ్చి పట్టించుకోలేదన్న పొంగులేటి  
  • అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని వెల్లడి
     

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా పెండింగ్​లో ఉన్న అర్బన్ ల్యాండ్​ సీలింగ్​ (యూఎల్సీ) దరఖాస్తుల పరిష్కారానికి  ప్రజా ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వేలాది మంది ఎదుర్కొంటున్న భూ సమస్యలకు తెరపడనుంది. యూఎల్సీ చట్టం పరిధిలోని క్రమబద్ధీకరించని, పాక్షికంగా క్రమబద్ధీకరించిన కాలనీలకు సంబంధించిన అర్జీలను వేగంగా పరిశీలించి, రూల్స్ ప్రకారం అర్హత ఉన్న కేసులను వెంటనే రెగ్యులరైజ్​ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గతంలో విడుదలైన జీవో నంబర్లు 455, 456, 747, 92 కింద ప్రజలు సమర్పించిన పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులన్నింటినీ పరిష్కరించేందుకు వీలుగా మెమో నం.48062/యూఎల్​సీ/ఏ1/2026–1 పేరిట స్పష్టమైన ఉత్తర్వులు విడుదల చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆదివారం వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లోనే ఈ దరఖాస్తుల పరిష్కారానికి నామమాత్రంగా ఒక జీవో విడుదల చేసినప్పటికీ, దానిని ఏనాడూ ఆచరణలో పెట్టకుండా గాలికొదిలేసిందని మంత్రి విమర్శించారు. 

పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడి వేలాది మంది సామాన్యులు సొంత స్థలాలు, ఇళ్లపై యాజమాన్య హక్కులు పొందలేక తీవ్ర మానసిక క్షోభ ఎదుర్కొన్నారని, ఆ పాత సమస్యలన్నింటికీ ఇప్పుడు తెరదించుతున్నామని స్పష్టం చేశారు.

22ఏ ఇబ్బందులకు ఫాస్ట్‌‌‌‌ ట్రాక్​ పరిష్కారం

ప్రజలను వేధిస్తున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఈ నెల 16న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీకి అనుగుణంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏతో ముడిపడిపోయి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న 10 నుంచి 12 కీలక వివాదాస్పద అంశాలను ఫాస్ట్‌‌‌‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తామని సీఎం సభలో ప్రకటించారని, అందులో భాగంగానే కేబినెట్ మంత్రులతో విస్తృతంగా చర్చించి వరుస నిర్ణయాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నిషేధిత జాబితా భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు, వరుసగా జీవో 118, జీవో 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలను జారీ చేశామన్నారు. మిగిలిన సమస్యలను సైతం ఇంతే వేగంగా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

గతంలో రాజకీయ లబ్ధికి వాడుకున్నరు

ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మెమో ప్రకారం.. పెండింగ్‌‌‌‌లో ఉన్న యూఎల్సీ దరఖాస్తులను క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం వేగంగా పరిశీలించి, అర్హత కలిగిన అన్ని కేసుల్లో నిబంధనల మేరకు అవసరమైన ప్రక్రియలను తక్షణం పూర్తి చేసి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వాలు సమస్యలను నాన్చుతూ రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాయని, కానీ తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ సంపూర్ణ పారదర్శకతతో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తులపై సర్వహక్కులు కల్పించడమే తమ లక్ష్యమని, ఇకపై రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దుస్థితి ప్రజలకు ఉండబోదని భరోసా ఇచ్చారు. చట్టం, నిబంధనలకు లోబడి న్యాయబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఆస్తి హక్కులు ధ్రువీకరించేలా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ ఉన్నతాధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి తేల్చిచెప్పారు. 
 

©️ VIL Media Pvt Ltd.