
మనీ లాండరింగ్ కేసులో రమ్మీ కల్చర్ భారీ షాకిచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ఈ కేసులో 442 కోట్ల 35 లక్షల చర స్థిరాస్తులు జప్తు చేసింది. దీంతో గేమ్స్ క్రాఫ్ట్ రమ్మీ కల్చర్ కు సంబంధించి ఫ్రీజ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ 2 వేల 843 కోట్లు.
గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాటాదారుల ఫ్యామిలీ, ప్రైవేట్ ఫ్యామిలీ ట్రస్టులు, వివిధ అనుబంధ సంస్థల పేర్ల మీద ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కమర్షియల్ షాప్స్, ఒక విల్లా , అనేక రెసిడెన్షియల్ అసెట్స్ లేటెస్టుగా జప్తు చేసిన జాబితాలో చేర్చారు.
తెలంగాణలోని పలు సంస్థలు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ (FIR)ల ఆధారంగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మనీ లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది.
ఈ దర్యాప్తు ప్రధానంగా గేమ్స్ క్రాఫ్ట్ టెక్నాలజీస్,రమ్మీ టైమ్ టెక్నాలజీస్ సంస్థలపై దృష్టి సారించింది. ఈ సంస్థలు రమ్మీ కల్చర్, రమ్మీ ప్రైమ్, రమ్మీ టైమ్ వంటి మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఆన్‌లైన్ క్యాష్ గేమ్స్ నిర్వహిస్తుంటాయి.
విచారణ ప్రకారం, ఈ ప్లాట్‌ఫారమ్‌లకు ఇండియా అంతటా సుమారు 3 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు చెందినవారు. ఈ రాష్ట్రాల్లో ఆన్‌లైన్ రియల్-మనీ గేమింగ్‌పై నిషేధం ఉండటం గమనార్హం.
►ALSO READ | నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ.. చడ్డీ గ్యాంగ్‌పై అనుమానాలు
వినియోగదారులు గేమ్ కోసం జమ చేసిన మొత్తాలపై 10 నుండి 15 శాతం వరకు ప్లాట్‌ఫారమ్ కమిషన్‌ను వసూలు చేయడం ద్వారా ఈ కంపెనీలు భారీ ఆదాయాన్ని ఆర్జించినట్లు విచారణలో తేలింది.
ఏఐ బాట్స్ ను ఉపయోగించారా..?
గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉన్నాయని, వాటిలో ఆటోమేటెడ్ ప్లేయర్‌లు లేదా బాట్‌లు లేవని కంపెనీలు వినియోగదారులకు హామీ ఇచ్చాయని ఈడీ దర్యాప్తులో తేలింది.
అయితే, ఆటోమేటెడ్ ప్రోగ్రామ్‌లు లేదా అల్గారిథమ్‌లుగా చెప్పే బాట్‌లను, కస్టమర్లకు తెలియకుండా లేదా వారి అనుమతి లేకుండా ప్రయోగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
కానీ ఈ బాట్‌ల వాడకం వల్ల వినియోగదారులకు తీవ్రమైన ఆర్థిక నష్టాలు వాటిల్లగా, కంపెనీలకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.