Reading Time: < 1 minute
Nani The Paradise Mixed Talk Reaction 18 Year Career

Nani: నేచురల్ స్టార్ నాని సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన అంచనా ఉంటుంది. విభిన్నమైన స్టోరీలను ఎంచుకుంటూ వెండి తెరపై తనకంటూ తిరుగులేని ముద్ర వేసుకున్న ఆయన, తాజాగా విడుదలైన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి వస్తున్న మిక్సిడ్ రియాక్షన్‌పై అత్యంత నిజాయితీగా స్పందించారు. దాదాపు రెండు దశాబ్దాల తన సినీ ప్రయాణంలో తాను ఎన్నడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని ఈ సినిమాతో చూస్తున్నానంటూ నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన తాజా చిత్రంపై వస్తున్న రకరకాల రివ్యూలు, ప్రేక్షకుల కామెంట్లపై నాని నేరుగా స్పందించారు. “నా 18 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇప్పటివరకు 33 చిత్రాలు చేశాను. కానీ నా ప్రయాణంలో ఇలాంటి భిన్నమైన అనుభవాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. సినిమా నచ్చిన వాళ్లు ఎంత అగ్రెసివ్‌నెస్‌తో, పిచ్చి ప్రేమతో ఓన్‌ చేసుకుంటున్నారో.. నచ్చలేదన్న వాళ్లలో కూడా అంతే స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు” అంటూ కుండబద్దలు కొట్టారు. ఆడియన్స్ నుంచి వచ్చే ఈ మిక్సిడ్ ఎమోషన్స్ తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని ఆయన పేర్కొన్నారు.

ఈ స్థాయి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడానికి గల అసలు కారణాన్ని విశ్లేషిస్తూ.. ప్రేక్షకులు తమ కాంబినేషన్‌ (నాని-శ్రీకాంత్ ఓదెల)పై పెట్టుకున్న అపరిమితమైన నమ్మకమే దీనికి నిదర్శనమని నాని అభిప్రాయపడ్డారు. “మా సినిమాపై జనాలు పెట్టుకున్న భారీ అంచనాల వల్లే రియాక్షన్స్ ఇంత తీవ్రంగా వస్తున్నాయి. ఒక ప్రాజెక్ట్ కోసం మేము వంద శాతం శ్రమించాం. సినిమాకు వచ్చిన ప్రతి ఒక్క ఫీడ్‌బ్యాక్‌ను, ప్రేక్షకుల ప్రతి రియాక్షన్‌ను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాం” అని నాని హుందాగా సమాధానమిచ్చారు. భవిష్యత్తులో ప్రేక్షకులందరినీ సంతృప్తిపరిచేలా, ప్రతి ఒక్కరూ థియేటర్లలో తన సినిమాను సెలబ్రేట్ చేసుకునేలా సరికొత్త ప్రాజెక్ట్‌లను తీసుకొస్తానని నాని ధీమా వ్యక్తం చేశారు. తన సినిమాపై వచ్చే విమర్శలను కూడా అంతే సానుకూలంగా స్వీకరిస్తూ నాని మాట్లాడిన తీరుపై సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.