Reading Time: 2 minutes
Harish Rao Brs Assembly Strategy Speaker No Confidence

Harish Rao : ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండగడతామని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని ఆరోపించిన ఆయన.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.

అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC)లో డిమాండ్ చేస్తామని హరీశ్ రావు తెలిపారు. సభలో తమకు మాట్లాడేందుకు తగిన సమయం, అవకాశం కల్పించాలని స్పీకర్‌ను కోరుతామని చెప్పారు. ప్రతిపక్షానికి సముచిత ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యవహరిస్తే ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. 22ఏ అంశంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్ రావు అన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని వ్యాఖ్యానించారు.

ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు అసెంబ్లీలో తగిన గౌరవం ఇవ్వడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితుల్లో కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా అభిప్రాయపడ్డామని తెలిపారు. గతంలో జయలలిత, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు వంటి నేతలు కూడా గౌరవం లభించని సందర్భాల్లో అసెంబ్లీకి దూరంగా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదే సమయంలో సీఎం కుటుంబ సభ్యులకు భద్రత కల్పించే విషయంలోనూ హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు. వార్డు మెంబర్‌గా కూడా లేని వ్యక్తికి గన్‌మెన్లను ఎందుకు కేటాయించారని, ఇందుకోసం ప్రభుత్వ నిధులను ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.

మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల అంశంలోనూ బీఆర్‌ఎస్ భారీ కార్యాచరణకు సిద్ధమవుతోందని హరీశ్ రావు తెలిపారు. రాబోయే రోజుల్లో లక్షలాది మందితో కలిసి కాళేశ్వరం ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల విషయంలో కేసీఆర్ ప్రత్యక్ష కార్యాచరణకు దిగనున్నారని వెల్లడించారు. సభలో తమకు తగిన సమయం ఇవ్వకపోతే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా వెనకాడబోమని హరీశ్ రావు హెచ్చరించారు. దీంతో రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.