Reading Time: 2 minutes

అసెంబ్లీ సమావేశాలను ఎవరూ లైట్ తీసుకోవద్దు: BRS ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఆదేశం

Caption of Image.

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను ఎవరూ లైట్ తీసుకోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. సోమవారం (సెప్టెంబర్ 7) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 6) ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‎ఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పకుండా హాజరు కావాలని సూచించారు. శాసన సభ, మండలిలో జరిగే ప్రతి చర్చలో పాల్గొనాలని.. అసెంబ్లీ సమావేశాలను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని దిశానిర్దేశం చేశారు. ఉభయ సభల్లోనూ కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎండగట్టాలన్నారు. స్పీకర్ పక్షపాత ధోరణి.. అప్రజాస్వామిక విధానాలు ఎండగట్టాలని సూచించారు. 

ఉభయ సభల్లోనూ ప్రజా సమస్యలపపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. అసెంబ్లీలో ప్రజల అజెండానే బీఆర్ఎస్ అజెండాగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న తమకు సంఖ్యాబలమే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఆ విషయాన్ని అసెంబ్లీలో చెప్పే బాధ్యత ప్రతిపక్ష ఎమ్మెల్యేలదేనని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను 20 నిర్వహించాలని బీఏసీ మీటింగ్‎లో పట్టుబట్టాలని సూచించారు. 

కాంగ్రెస్ 1000 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్:

కాంగ్రెస్ 1000 రోజుల పాలన, సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలన డిజాస్టర్, అట్టర్ ఫ్లాప్ అని అభివర్ణించారు. తమ ప్రభుత్వం పోవడం ఖాయమని కాంగ్రెస్ నేతలకు అర్థమైందని.. అందుకే అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. 

సీఎం రేవంత్‎పై కేసీఆర్ ఫైర్:

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పాలన చేతకాక బూతులు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బూతుల వీరుడు చర్చలకు అసెంబ్లీకి నన్ను రమ్మంటున్నాడు. బూతులు మాట్లాడే వారితో చర్చించేందుకు నేను అసెంబ్లీకి రావడం అవసరమా..? నేను అసెంబ్లీ రావాలా..? వద్దా..? మీరే చెప్పండని అన్నారు. నా చావు కోరుతూ పదేపదే స్పీచ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన అని.. రేవంత్ హయాంలో తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్ కనిపిస్తోందని విమర్శించారు. 

©️ VIL Media Pvt Ltd.