Reading Time: < 1 minute

చైనా గడ్డపై భారత్ సత్తా: డ్రాగన్‌ను చిత్తు చేసి సాత్విక్-చిరాగ్ హిస్టారికల్ విక్టరీ

Caption of Image.

బీజింగ్: భారత స్టార్ బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక చైనా మాస్టర్స్ సూపర్ 750 పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 6) జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‎లో చైనా జోడీ హీ జి టింగ్, రెన్ జియాంగ్ యూను 11-21, 21-13, 21-17 తేడాతో చిత్తు చేశారు. తద్వారా సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ద్వయం తొలిసారి చైనా మాస్టర్స్ టైటిల్‎ను కైవసం చేసుకుంది. 2023, 2025లో రన్నరప్‏గా నిలిచిన భారత జోడీ మూడోసారి మళ్లీ అలాంటి పొరపాటు చేయకుండా టైటిల్ ఒడిసిపట్టుకుంది. చైనా మాస్టర్స్ టోర్నీ విజేతగా నిలిచిన సాత్విక్‌, చిరాగ్ జోడీకి పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

షెన్‌జెన్‌లోని అరీనాలో జరిగిన ఈ ఫైనల్ పోరు గంటా 10 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. విజయం కోసం ఇరుజట్లు చివరిదాకా పట్టువదలకుండా తలపడ్డాయి. ముఖ్యంగా భారత జోడీ పోరాటం అద్భుతం. తొలి సెట్ కోల్పోయినప్పటికీ వెనకడుగు వేయకుండా మొక్కవోని ధైర్యంతో చివరి వరకు పోరాడి విజేతగా నిలిచింది. 

తొలి గేమ్‌లో చైనా జోడీ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దీంతో సాత్విక్-చిరాగ్ 11-21 తేడాతో ఫస్ట్ సెట్ కోల్పోయారు. ఈ ఝలక్ నుంచి వెంటనే తేరుకున్న భారత ద్వయం సెకండో సెట్‎లో సూపర్ కంబ్యాక్ ఇచ్చింది. పవర్ ఫుల్ స్మాష్ లు, వ్యూహాత్మక డిఫెన్స్‎తో ప్రత్యర్థిని బోల్తా కొట్టించి 21-13తో సెకండ్ సెట్ గెలిచింది. ఇరుజట్లు చెరో సెట్ గెలవడంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో సెట్‎కు దారి తీసింది. 

►ALSOL READ | వైభవ్ ఊచకోత.. బౌలింగ్‌లో సిరాజ్కే చుక్కలు: తెలంగాణ డీజీపీ కొడుకు దెబ్బకి సూర్యవంశీ ఔట్!

నిర్ణయాత్మక మూడో సెట్ చివరి వరకు అత్యంత ఉత్కంఠభరింతగా సాగింది. ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తొలుత చైనా జోడీ 4-0 ఆధిక్యంతో దూకుడుగా ప్రారంభించినా.. సాత్విక్-చిరాగ్ పట్టు విడువలేదు. స్కోరు 17-17తో సమమైన దశలో భారత జోడీ చెలరేగి ఆడింది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 21-17తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను, టైటిల్‌ను సొంతం చేసుకుంది. 

©️ VIL Media Pvt Ltd.