
ఎర్రవల్లిలోని తన నివాసంలో శనివారం జరిగిన బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష (BRSLP) సమావేశంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న పాలన తీరుపై మండిపడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని, శాసనసభ వేదికగా ప్రతిపక్షాలను ఆహ్వానిస్తున్న తీరును ఎండగట్టారు.
నేను అసెంబ్లీకి రావాలా? వద్దా?: ఎమ్మెల్యేలను అడిగిన కేసీఆర్
శాసనసభ సమావేశాల సందర్భంలో అధికార పార్టీ నడుచుకుంటున్న తీరును కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నారని, అటువంటి బూతుల వీరుడు అసెంబ్లీకి చర్చకు రమ్మని పిలవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. అసభ్యకరంగా మాట్లాడే వారితో చర్చించేందుకు తాను శాసనసభకు రావడం అవసరమా అని పరోక్షంగా ప్రశ్నించారు. “నేను అసెంబ్లీకి రావాలా? వద్దా? మీరే చెప్పండి” అని సమావేశంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను ఆయన నేరుగా అడిగారు.
నా చావు కోరుతూ ప్రసంగాలు ఇస్తున్నారు
కాంగ్రెస్ నాయకులు రాజకీయం కోసం దిగజారి మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. పదేపదే తన చావును కోరుకుంటూ ప్రసంగాలు ఇస్తున్నారని, మరొకవైపు తాము అసెంబ్లీకి రావాలంటూ ధర్నాలు చేయడం వారి ద్వంద్వ విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నది థర్డ్ క్లాస్ పాలన అని అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో ఎక్కడా ప్రగతి కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ చెబుతున్నట్లుగా ‘తెలంగాణ రైజింగ్’ కాదని, ‘తెలంగాణ ఫాలింగ్’ ప్రత్యక్షంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
లక్ష మందితో ప్రాజెక్టుల సందర్శన
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ వైఖరిపై ప్రజల్లోకి వెళ్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే లక్ష మందితో కలిసి కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుల వద్దకు వెళ్తామని సంచలన ప్రకటన చేశారు. ప్రాజెక్టుల వద్దకే నేరుగా వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, నీటి పారుదల రంగానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరిస్తామని తేల్చి చెప్పారు.