
Vikarabad Land Fraud : కంటికి రెప్పలా పెంచుకున్న కూతురిపై నమ్మకంతో భూమి రాసిస్తే, అల్లుడు దారుణమైన మోసానికి ఒడిగట్టాడు. అత్త నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, అధికారుల అండతో భూమి మొత్తాన్ని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన చెంద్రమ్మకు 4 ఎకరాల 27 గుంటల భూమి ఉంది. ఆమెకు ఒక కూతురు లక్ష్మి, ఒక పెంపుడు కొడుకు ఉన్నారు. తన బాధ్యతలన్నీ చూసుకుంటుందనే నమ్మకంతో ఉన్న ఒక్క కూతురు లక్ష్మికి 2 ఎకరాల 6 గుంటల భూమిని ఇవ్వాలని, పెంపుడు కొడుకుకు ఎకరంన్నర భూమిని ఇవ్వాలని చెంద్రమ్మ నిర్ణయించుకుంది. కాగా, అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డ్రామా
కూతురి పేరిట 2 ఎకరాల 6 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి చెంద్రమ్మ పరిగి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చింది. అయితే, అల్లుడు మల్లేష్ రెవెన్యూ అధికారులు , కంప్యూటర్ ఆపరేటర్‌తో కుమ్మక్కై పెద్ద డ్రామాకే తెరలేపాడు. రిజిస్ట్రేషన్ సమయంలో చెంద్రమ్మ పదే పదే 2 ఎకరాల 6 గుంటలే కదా అని అడిగినప్పటికీ, ఆపరేటర్ అవుననే సమాధానమిచ్చాడు. కానీ, లోపల మాత్రం చెంద్రమ్మకు చెందిన మొత్తం 3 ఎకరాల 6 గుంటల భూమిని అల్లుడు తన పేరిట మార్చేసుకున్నాడు.
బాధితురాలి ఆవేదన… పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
తీరా రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక తన పేరిట ఒక్క గుంట భూమి కూడా మిగలలేదని తెలుసుకున్న చెంద్రమ్మ తహసీల్దార్ కార్యాలయం వద్దే లబోదిబోమంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నమ్మి వస్తే అల్లుడే కొంపముంచాడని కన్నీరుమున్నీరైంది. అనంతరం గ్రామ పెద్దలతో కలిసి పరిగి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మోసంపై తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయడంతో, అధికారులు తదుపరి చర్యల్లో భాగంగా పాస్ పుస్తకాలు జారీ కాకుండా నిలిపివేశారని గ్రామస్థులు తెలిపారు.