
హైదరాబాద్: రవీంద్ర భారతిలో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్వర్యంలో భారత్ గురు రత్న అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని చెప్పారు. “పుస్తకం లేని బాల్యం ఉండకూడదు” అనే ఆలోచనతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలతో పాటు సామాజిక అవగాహన అవసరం అని మంత్రి అభిప్రాయపడ్డారు. పిల్లల భవిష్యత్తు, సంస్కృతి, ప్రవర్తన తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని, చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన మరోసారి గుర్తు చేశారు.
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు వెన్నెముకలా పనిచేస్తున్నారని, టీచర్స్ డే వంటి సందర్భాల్లో ఉపాధ్యాయులను గౌరవించి గుర్తించాలని మంత్రి చెప్పారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు, టీవీలు విద్యార్థులకు ఆటంకాలుగా మారుతున్నాయని ఆయన వివరించారు. విద్యార్థులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని ఆయన అభిప్రాయపడ్డారు.
డిజిటల్ డిస్ట్రాక్షన్స్‌ను అధిగమించి విద్యార్థులకు బలమైన పునాది నిర్మించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని మంత్రి చెప్పారు. తన విజయానికి పాఠశాల రోజుల్లో ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ, పట్టుదలే కారణమని మంత్రి గుర్తుచేశారు.
డాక్టర్‌గా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎదగడంలో ఉపాధ్యాయుల బోధన తనకు కీలకం అయిందని చెప్పారు. విద్యార్థులు ఉపాధ్యాయుల మాటలను గౌరవించి క్రమశిక్షణ పాటించాలని.. క్రమశిక్షణ, పట్టుదలతోనే విద్యార్థులు జీవితంలో విజయం సాధిస్తారని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.