Reading Time: < 1 minute
Ramnagar Ganesh Procession Stampede 19 Year Old Btech Student Dies

Ramnagar Stampede: హైదరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో నిర్వహించిన గణేష్ ఆగమన్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. వేలాది మంది యువకులు తరలివచ్చిన ఈ ర్యాలీలో తొక్కిసలాట జరగడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డీజే చప్పుళ్ల మధ్య యువకులు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో రాంనగర్ చౌరస్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి ఆగమనం సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువకులు హాజరయ్యారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువ కావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో కిందపడిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

మృతుడిని బద్రీనాథ్ (19)గా గుర్తించారు. ఆయన అబిడ్స్‌లోని మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్నట్లు అధికారులు తెలిపారు. రాంనగర్‌లోని గౌరీ శంకర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బద్రీనాథ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కాసేపట్లో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సమాచారం. భారీ సంఖ్యలో యువత తరలివచ్చిన గణేష్ ఆగమన్ ర్యాలీలో ఊహించని విధంగా తొక్కిసలాట జరగడం, ఓ యువకుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది.