
- అలిమ్కో సహకారంతో 46,300 మందికి లబ్ధి
- రూ.3,500 విలువైన ఉపకరణాలు ఉచితం
హైదరాబాద్,వెలుగు: సర్కారు బడిలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు భరోసా కల్పించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో వైకల్య తీవ్రతను గుర్తించి, వారికి అవసరమైన కృత్రిమ అవయవాలు, ఇతర ఉపకరణాలను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 7 నుంచి 25 వరకు అన్ని జిల్లాల్లో ఈ అసెస్‌మెంట్ క్యాంపులు జరగనున్నాయి. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో అలిమ్కో (ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
రాష్ట్రంలోని వివిధ సర్కారు మేనేజ్‌మెంట్ స్కూళ్లలో చదువుతున్న సుమారు 46,300 మంది దివ్యాంగ విద్యార్థులను అధికారులు గుర్తించారు. వీరందరికీ ఈ క్యాంపుల్లో నిపుణులైన వైద్యులతో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి విద్యార్థికి ఉన్న వైకల్య తీవ్రతను బట్టి వారికి అవసరమైన వీల్ ఛైర్లు, ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, ఇతర కృత్రిమ అవయవాలను అధికారులు సూచిస్తారు. ఎంపికైన ప్రతి విద్యార్థికి సుమారు రూ.3,500 విలువ చేసే ఉపకరణాలను తర్వాతి విడతలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. శిబిరాలకు వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఫోటోలు, సదరం సర్టిఫికెట్, రేషన్ కార్డు తీసుకురావాలని అధికారులు తెలిపారు.