Reading Time: < 1 minute
Iran Fuel Tanker Explosion 11 Killed 7 Injured Near Sanandaj

Iran: యుద్ధంతో ఉక్కిరిబిక్కిర అవుతున్న వేళ, ఇరాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ ఇరాన్‌లోని సనందజ్ సమీపంలో ఓ ఇంధన ట్యాంకర్ ఇతర వాహనాలను ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగి పేలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. కుర్దిస్తాన్ ప్రావిన్స్‌లోని సనందజ్-హమదాన్ మధ్య ఇంటర్ సిటి రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. సనందజ్ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న సమయంలో ట్యాంకర్ ఇతర కార్లను ఢీకొట్టినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.

ఆ తర్వాత వెంటనే మంటలు చెలరేగి, పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ట్యాంకర్ బ్రేకింగ్ వ్యవస్థలో వైఫల్యం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ట్యాంకర్ మంటలు ఇతర వాహనాలకు వ్యాపించాయి. దీంతో మరణాల సంఖ్య పెరిగింది. ప్రమాదంలో గాయపడిన ఏడుగురిని చికిత్స కోసం సనందజ్‌లోని ఆస్పత్రికి తరలించారు. 2018లో కూడా ఇదే ప్రాంతలో ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కూడా ఇంధన ట్యాంకర్ వల్లే ప్రమాదం జరిగి 15 మంది చనిపోయారు.