
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న సరికొత్త ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ “టార్టాయిస్”. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీ పరిచయం..’ అంటూ సాగే ఎమోషనల్ మెలోడీ గీతాన్ని హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు రిత్విక్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సినిమా కథపై దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ సంచలన విషయాలు పంచుకున్నారు. “బొమ్మరిల్లు, మజిలీ లాంటి క్లాసిక్ ఫ్యామిలీ, ఎమోషనల్ చిత్రాలను థ్రిల్లర్ జోనర్‌లోకి మారిస్తే ఎలా ఉంటుందో.. ఈ ‘టార్టాయిస్’ సినిమా అలా ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్లలో సీట్ ఎడ్జ్‌లో కూర్చుని సినిమా చూస్తారు. ఈ కథలో మొత్తం ఐదు భారీ ట్విస్టులు ఉన్నాయి. ప్రతి 25 నిమిషాలకు ఒక బాంబ్ లాంటి ఊహించని ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ఐదు ట్విస్టులను ఎవరూ ముందుగా కనిపెట్టలేరు. మూడు రోజుల క్రితమే మా ప్రొడ్యూసర్లు సినిమా చూసి ఎంతో ఎగ్జైట్ అయి హగ్ చేసుకున్నారు. హిట్ గ్యారెంటీ అని చెప్పడంతో.. థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు రెడీ చేసుకోండి సార్ అని వారితో ధీమాగా చెప్పాను” అని దర్శకుడు పేర్కొన్నారు. ఈ సినిమాలో మొత్తం 80 సీన్లు ఉంటే, అందులో 70 సీన్లలో అవసరాల శ్రీనివాస్ కనిపిస్తారని, వదిన అంటే తల్లి లాంటిదని భావించే పాత్రను ధన్య బాలకృష్ణ పోషించారని వెల్లడించారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ఇదొక యూనిక్ థ్రిల్లర్ అని, థియేటర్లలో ఆడియన్స్‌ను మొదట్నుంచి చివరివరకు పూర్తిగా ఎంగేజ్ చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. కథలో లవ్ ఎలిమెంట్‌ను టర్న్ చేస్తూ ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా నడిపించిన తీరు రాజ్ తరుణ్ కెరీర్‌లోనే సరికొత్త ప్రయోగంగా నిలవనుంది. దర్శకుడు చెప్పిన షెడ్యూల్స్ ప్రకారం రాత్రిళ్లు, వర్షంలో, చలిలో కూడా ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేసినట్లు నిర్మాతలు హీరోను ప్రశంసించారు.