Reading Time: < 1 minute
High Tension During Producer Council Elections Natti Kumar And Bekkam Venugopal Engaged In A Heated Altercation Near The Polling Booth

తెలుగు సినీ నిర్మాతల మండలి ఎన్నికలు ప్రక్రియ వాడివేడిగా సాగుతోంది. రెండు వైస్ ప్రెసిడెంట్, రెండు సెక్రటరీ, రెండు జాయింట్ సెక్రటరీ, ఒక ట్రెజరర్ పదవికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రొగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య పోటీ జరుగుతోంది. ప్రొగ్రెసివ్ ప్యానెల్‌కు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు మద్దతు.. మన ప్యానెల్‌కు చదలవాడ శ్రీనివాసరావు మద్దతిస్తున్నారు.

ఉదయం నుండి ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిర్మాతలు నట్టి కుమార్, బెక్కెం వేణుగోపాల్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడంతో పాటు ఒకరినొకరు తోసేసుకునే వరకు పరిస్థితి దారితీసింది. ఓట్ స్లిప్ పంపిణీ చేసే టేబుల్ వద్ద బెక్కెం వేణుగోపాల్ నిలబడటంపై నిర్మాత నట్టి కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా బెక్కెం ప్రచారం చేస్తున్నారంటూ నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి సభ్యులతో ఎలాంటి పలకరింపులు లేదా పర్సనల్ మాటలు ఉన్నా బయట చూసుకోవాలని పోలింగ్ ప్రాంతంలో ఉండటం సరికాదని మండిపడ్డారు.

ఈ ఆరోపణలపై బెక్కెం వేణుగోపాల్ స్పందిస్తూ.. తాను ఎలాంటి క్యాన్వాసింగ్ చేయడం లేదని తన చేతిలో ఎలాంటి పాంప్లెట్లు కూడా లేవని స్పష్టం చేశారు. కేవలం ఓటు వేయడానికి వచ్చిన తోటి నిర్మాతలను పలకరించేందుకే అక్కడికి వచ్చానని వివరణ ఇచ్చారు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి తోపులాట జరగడంతో వాతావరణం వేడెక్కింది. వెంటనే రంగంలోకి దిగిన సీనియర్ నిర్మాత సీ. కళ్యాణ్ ఇరువర్గాలకు సర్దిచెప్పి నచ్చజెప్పడంతో నట్టి కుమార్, బెక్కెం వేణుగోపాల్ శాంతించారు. దీంతో పోలింగ్ ప్రాంగణంలో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి.