Reading Time: 2 minutes
Indonesia Anak Krakatoa Volcano Eruption 209 Flights Affected

Indonesia: ఇండోనేషియాలోని అనాక్ క్రాకటోవా అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున భారీగా విస్ఫోటనం చెందింది. ఈ విస్ఫోటనం కారణంగా వెలువడిన బూడిద పశ్చిమ ఇండోనేషియాలోని పలు ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో జకార్తాలోని సుకర్ణో – హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం 209 విమానాలు ఈ అగ్నిపర్వతం కారణంగా ప్రభావితమవగా.. సుమారు 22,800 మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ విమానాలు రెండూ ప్రభావితమయ్యాయని అధికారులు చెబుతున్నారు. జావా, సుమత్రా ద్వీపాల మధ్య ఉన్న సుండా జలసంధిలో అనాక్ క్రాకటోవా అగ్నిపర్వతం ఉంది. ఆదివారం ఉదయం 3:53 గంటల సమయంలో సుమారు 30 సెకన్ల పాటు విస్ఫోటనం జరిగిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అనంతరం రెండు భారీ బూడిద మేఘాలు ఏర్పడ్డాయని, ఒక మేఘం దాదాపు 20 వేల అడుగుల ఎత్తుకు చేరుకుని ఈశాన్య దిశగా కదిలిందని, దీని కారణంగా జకార్తా, బాంటెన్, పశ్చిమ జావా ప్రాంతాలు ప్రభావితమయ్యాయని పేర్కొంటున్నారు.

రెండో బూడిద మేఘం ఏకంగా 50 వేల అడుగుల ఎత్తుకు చేరినట్లు సమాచారం. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా వ్యాపిస్తూ బాంటెన్, లాంపంగ్, బెంగ్‌కులు, దక్షిణ సుండా జలసంధి, సుమత్రా పశ్చిమాన ఉన్న హిందూ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. బూడిద కారణంగా సుకర్ణో-హట్టా విమానాశ్రయంలో మొదట ఉదయం 5:30 గంటల వరకు విమానాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు, తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆంక్షలను ఉదయం 9:30 గంటల వరకు పొడిగించారు. విమానాశ్రయంలో రాత్రి పార్క్ చేసిన 170 విమానాలు అక్కడే నిలిచిపోయాయి. పలువురు ప్రయాణికులు టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతో పాటు చెక్-ఇన్ చేసిన సామాన్లను కూడా వెనక్కి తీసుకున్నారు.

సింగపూర్‌కు వెళ్లే అంతర్జాతీయ విమానాలపై దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. హాంకాంగ్, సిడ్నీ, ఆమ్‌స్టర్‌డామ్, సియోల్, దోహా, కౌలాలంపూర్ విమానాలు రద్దు, ఆలస్యం లేదా రీషెడ్యూల్ అయ్యాయి. లాంపంగ్, బాలి, సురబయ, మకాసర్ ప్రాంతాలకు వెళ్లే కొన్ని దేశీయ విమానాలపైనా కూడా దీని ప్రభావం పడింది. ప్రస్తుతం ఈ అగ్నిపర్వతం బద్ధలవ్వడం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, గాయాలపాలైనట్లు సమాచారం బయటికి రాలేదు. అలాగే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆదేశాలు కూడా జారీ కాలేదని తెలుస్తోంది. అయితే అగ్నిపర్వత క్రియాశీల క్రేటర్‌కు కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలని ప్రజలు, పర్యాటకులకు అధికారులు సూచించారు. బూడిద పడే ప్రాంతాల్లో మాస్కులు, కళ్ల రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళ్లడం తగ్గించాలని, నీటి వనరులను మూసి ఉంచాలని అధికారులు సూచించారు. అనాక్ క్రాకటోవా చరిత్ర దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. 2018లో ఇదే అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా సంభవించిన సునామీలో కనీసం 430 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మళ్లీ ఈ అగ్నిపర్వతం బద్ధలవ్వడం, బూడిద వ్యాప్తిని ఇండోనేషియా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.