
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర టూరిజం పాలసీ లక్ష్యాలకు అనుగుణంగా పర్యాటక మౌలిక వసతుల కల్పనను స్పీడప్ చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్రంలోకి పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరుగుతున్నందున, అధిక అవకాశాలున్న కీలక ప్రాంతాలను గుర్తించి అక్కడ నాణ్యమైన స్టార్ హోటల్ వసతులను అభివృద్ధి చేయాలని సీఎస్ సూచించారు. సందర్శకులకు మెరుగైన ఆతిథ్యం అందించేందుకు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తులను ఆధునీకరించి తీర్చిదిద్దాలన్నారు.
నిబంధనలకు లోబడి ప్రభుత్వ భూములు, అనుమతించదగిన సెమీ-ఫారెస్ట్ భూములను గుర్తించాలని స్పష్టం చేశారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత విస్తృతం చేసేందుకు ప్రముఖులను ప్రచారంలో భాగస్వాములను చేయాలని, ఆకట్టుకునేలా ఒక కొత్త ట్యాగ్‌లైన్‌ను రూపొందించాలని చెప్పారు. చారిత్రక వారసత్వం, విశిష్ట సంస్కృతితో పాటు ఎకో-టూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి విభాగాలను సమన్వయం చేస్తూ కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. ఈ మొత్తం ప్రక్రియలో జిల్లా కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.