
- ఏపీని ఆపకుండా.. తమపైనే అక్కసు వెళ్లగక్కడంపై అసంతృప్తి
- బోర్డు చైర్మన్కు లేఖ రాయనున్న ఇరిగేషన్ సెక్రటరీ
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి చేయొద్దన్న కృష్ణా బోర్డు తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. సాగర్ కింద తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జలవిద్యుదుత్పత్తి చేస్తుంటే.. అక్కసు వెళ్లగక్కడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. దీనిపై కృష్ణా బోర్డు చైర్మన్కు ఇరిగేషన్ సెక్రటరీ తీవ్రంగా స్పందిస్తూ లేఖ రాయబోతున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.అసలు శ్రీశైలం ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి.. దాన్ని ఎలా మార్చేశారన్న దానిపై సవివరంగా బోర్డు తీరును లేఖలో ఎండగట్టనున్నారు.
రెండు రాష్ట్రాల విషయంలో పక్షపాతం లేకుండా పనిచేయాల్సిన బోర్డు ఏకపక్షంగా.. కేవలం ఏపీ స్టాండ్ తీసుకుని మాట్లాడుతుండడాన్ని లేఖలో తీవ్రంగా ఆక్షేపించనున్నట్టు తెలిసింది. గతంలో ఎన్నోసార్లు ఇలా చేశారని, ఇప్పుడు తాజాగా ఏకపక్షంగా మళ్లీ అలాంటి నిర్ణయాన్నే తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకున్నారని ప్రభుత్వం తేల్చి చెప్పనుంది. ఇక, ఈ వ్యవహారంపై ఈఎన్సీ జనరల్ రమేశ్ బాబు కూడా కృష్ణా బోర్డుకు లేఖ రాశారు.
త్రీమెన్ కమిటీ మీటింగ్లో రెండు రాష్ట్రాలవైపు మాట్లాడకుండా కేవలం ఏపీవైపే మెంబర్ సెక్రటరీ మాట్లాడారంటూ ఆక్షేపించారు. బోర్డు తీరును తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణను మాత్రమే విద్యుదుత్పత్తి ఆపాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటిని విచ్చలవిడిగా తోడేస్తున్నా ఎందుకు నోరు మెదపడం లేదని లేఖలో ప్రశ్నించారు.