
ఏకాదశి.. హిందూ క్యాలెండర్‌లో ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున విష్ణువు భక్తులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలాంటి పవిత్రమైన రోజులు నెలకు రెండు రోజులు వస్తాయి.హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఏడాదిలో 24 ఏకాదశి తిథులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక్కోపేరు పెట్టారు రుషిపుంగవులు. శ్రావణమాసం బహుళ పక్షంలో (అమావాస్యకు ముందు) వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి ( 2026 సెప్టెంబర్ 7) అంటారు. ఈ నేపథ్యంలో అజ ఏకాదశి అంటే ఏంటి, అసలు దీని ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి పూజలు చేయాలి లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణ మాసంలో కృష్ణ పక్ష ఏకాదశిని అజ ఏకాదశి అని అంటారు. ఆ రోజు విష్ణువుకి అంకితం చేయబడింది. ఆ రోజు ఉపవాసం ఉండి విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే పాపాలు తొలగిపోతాయి. కష్టాలు, పేదరికం నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది. అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం అజ ఏకాదశి వ్రతం ద్వారా లభిస్తుంది.
అజ ఏకాదశి శుభముమూర్తం
- అజ ఏకాదశి తిథి ప్రారభం: సెప్టెంబర్ 6 సాయంత్రం 7:29 గంటలకు
- అజ ఏకాదశి తిథి ముగింపు: సెప్టెంబర్ 7 సాయంత్రం 5:03 గంటలకు
- అజ ఏకాదశి ఉపవాసం : సెప్టెంబర్ 7
- ఉపవాస విరమణ సమయం: సెప్టెంబర్ 8 ఉదయం 6:21 గంటల నుంచి 8:50 గంటల మధ్యలో
ఏం చేయాలి..
- అజ ఏకాదశి వ్రతం ఏకాదశి ఉదయం ప్రారంభించాలి.
- ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి తలస్నానం చేయాలి.
- భగవాన్ హృషికేశుడిని/విష్ణువును ఆవాహన చేసి పూజించండి.
- ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు దశమి రోజు నుంచి ఉపవాసాన్ని ప్రారంభించాలి.
- ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి.
- పూజా స్థలంపై విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉంచి ‘పంచామృతం’ అభిషేకం చేయాలి.
- పూలు, పసుపు, కుంకుమతో అర్చించి .. విష్ణు సహస్రనామం పఠించాలి. లేదా శ్రద్దగా విన్నా సరిపోతుంది. పూజలో కచ్చితంగా తులసి దళాలు ఉండేలా చూసుకోండి.
- విష్ణుమూర్తి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండాలి.
- విష్ణువును స్తుతిస్తూ భజనలు….భక్తి పాటలు పాడుతూ రాత్రంతా జాగారం చేస్తారు. భక్తులు సాయంత్రం సమయంలో సమీపంలోని విష్ణువు ఆలయాలను కూడా సందర్శించాలి
- అజ ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయఅనేమంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేయాలి.
- విష్ణు సహస్రనామం ..విష్ణు చాలీసా మొదలైనవి పఠించాలి
- బ్రాహ్మణులకు స్వయంపాకం, దక్షిణ ఇవ్వాలి.పేదలకు అన్నదానం చేయాలి. దీనివల్ల విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి.
ఏం చేయకూడదు
- ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆరోగ్య కారణాల రీత్య ఉండలేని వారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. సాత్విక ఆహారం మాత్రమే తినాలి. పప్పులు తినకూడదు.
- ఏకాదశి, ద్వాదశి రోజులలో మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు.
- 2026 సెప్టెంబర్7 వ తేదీన అజ ఏకాదశి కావున ఆరోజు మద్యం సేవించడం, ధూమపానం, మాదకద్రవ్యాలు, పొగాకు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలి.
- బ్రహ్మచర్యం పాటించాలి.
- జాగారం చేయడం మంచిది. అలా ఉండలేని వారు కింద నేలపై పడుకోవాలి.
- ఇతరులను విమర్శించకూడదు. ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడకూడదు. ఒకరిపై చాడీలు చెప్పకూడదు.
- అజ ఏకాదశి రోజు చాలా శాంతంగా ఉండాలి.. కోపం.. ఆవేశం.. దూకుడుగా ఉండకూడదు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.