
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI).. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతికతలపై పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌లో భాగమైన RCIలో రీసెర్చ్ అసోసియేట్ (RA), జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) తాత్కాలిక పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది..
రీసెర్చ్ అసోసియేట్ (RA) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్ తదితర విభాగాల్లో అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో PhD లేదా ఫస్ట్ క్లాస్ M.Tech అర్హత కలిగి ఉండాలి. సంబంధిత పరిశోధన అనుభవం కూడా అవసరం. ముఖ్యంగా Deep Learning, Machine Learning, Artificial Intelligence, Real-time Systems, Structural and Thermal Analysis, Power Electronics, RF & Microwave, Radar Engineering, Experimental Quantum Optics వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి అవకాశం ఉంటుంది. M.Tech అభ్యర్థులకు సంబంధిత రంగంలో మూడేళ్ల పరిశోధన అనుభవం ఉండాలి. ఫిజిక్స్‌లో M.Sc చేసిన అభ్యర్థులకు నాలుగేళ్ల అనుభవం అవసరం. అలాగే SCI జర్నల్స్‌లో పరిశోధనా పత్రాలు ప్రచురించి ఉండటం తప్పనిసరి.
JRF పోస్టుల కోసం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, IT, మెకానికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ B.E./B.Tech డిగ్రీతో పాటు చెల్లుబాటు అయ్యే GATE స్కోర్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో M.E./M.Tech అర్హత ఉన్నవారికి కూడా అవకాశం ఉంది. కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్‌లో ఫస్ట్ క్లాస్ M.Scతో పాటు చెల్లుబాటు అయ్యే NET, GATE లేదా SLET స్కోర్ ఉన్న అభ్యర్థులు కూడా JRF పోస్టులకు అర్హులు. JRF నియామకం తొలుత రెండేళ్ల పాటు ఉంటుంది. అభ్యర్థి పనితీరు ఆధారంగా మూడో, నాలుగో సంవత్సరాలకు Senior Research Fellow (SRF)గా కొనసాగించే అవకాశం ఉంటుంది. అభ్యర్ధుల వయోపరిమితి RA పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు, JRF పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 28 సంవత్సరాలుగా నిర్ణయించారు. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అభ్యర్థులు DRDO అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫార్మాట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో అవసరమైన వివరాలను పూర్తి చేసి, విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాల స్వీయ ధ్రువీకరించిన (Self-attested) కాపీలను జత చేయాలి. RA పోస్టుకు దరఖాస్తు చేసే వారు కవర్‌పై ‘Application for Research Associate’, JRF పోస్టుకు దరఖాస్తు చేసేవారు ‘Application for Junior Research Fellow’ అని స్పష్టంగా రాయాలి. ఈ దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌కు సెప్టెంబర్ 13, 2026వ తేదీలోపు పంపించవల్సి ఉంటుంది. అభ్యర్థుల దరఖాస్తులను ముందుగా పరిశీలించి.. RA పోస్టులకు అభ్యర్థుల రీసెర్చ్ వర్క్, అనుభవం, PhD థీసిస్ సంబంధిత పోస్టుకు ఎంతవరకు ఉపయోగపడుతుందనే అంశాలను పరిశీలించి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలవారీ స్టైపెండ్ చెల్లిస్తారు.
అడ్రస్
Head, Human Resource Development,
Dr. APJ Abdul Kalam Missile Complex,
RCI, Vignyan Kancha,
Hyderabad, Telangana – 500069.