
హిమాలయాలలో 19 ప్రధాన నదులు పుట్టాయి. ఇవి మూడు నదీ ప్రవాహక వ్యవస్థలు (సింధు, గంగ, బ్రహ్మపుత్ర)గా వ్యవస్థీకరించడమైనది. దక్షిణాసియా భౌగోళిక, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థకు హిమాలయాలు కీలకం. సింధు (ఇండస్), గంగ, బ్రహ్మపుత్ర నదులతో సహా దాదాపు 19 ఆసియా ఖండ భారీ నదీ వ్యవస్థలకు ఇది పుట్టినిల్లు. ఈ నదులు దాదాపు 1.9 బిలియన్ జనాభాకు నీళ్లు అందిస్తాయి. ప్రపంచ జనాభాలో 25 శాతం ప్రజలు హిమాలయ నీటి వ్యవస్థ మీద ఆధారపడుతున్నారు.
‘వాటర్ టవర్స్ ఆఫ్ ఆసియా’
హిమాలయాలను ‘వాటర్ టవర్స్ ఆఫ్ ఆసియా’ అని పిలుస్తారు. కరుగుతున్న హిమానీనదాలు సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలను అస్థిరపరుస్తాయి. ఇది మొదట వరదలకు, తరువాత తీవ్రమైన నీటి కొరతకు దారి తీస్తుంది. స్థిరమైన వృక్షసంపద, హిమా నీనదాలు లేకుండా ఎత్తైన కొండవాలులు తరచుగా జారిపోతాయి. దీంతో 2013 ఉత్తరాఖండ్ వరదలు వంటి విపత్తులు, మొన్నటి నేపాల్ వరద వంటి ఉత్పాతాలు పెరుగుతాయి. భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు హిమాలయ నదులపై ఆధారపడి ఉన్నాయి. హిమాలయాల మీద భూతాపం ప్రభావం వల్ల భవిష్యత్తులో తాగునీరు, సాగునీరు, జలవిద్యుత్ ప్రమాదం ఏర్పడుతుంది. వ్యవసాయం కుంటుపడుతుంది. ఆహార కొరత ఏర్పడుతుంది.
హిమాలయాలలో భారత్, చైనా దేశాలు చేస్తున్న విధ్వంసకర అభివృద్ధి రచన దీర్ఘకాలికంగా దక్షిణాసియా ఖండం మీద తీవ్ర దుష్పరిణామం ఎదుర్కోనున్నది.
భూమి ఉష్ణోగ్రత పెరిగి తేహిమానీనదాలు కనుమరుగు
ఐసీఐఎంఓడీ సంస్థ పూర్తిగా హిమాలయాల మీద పరిశోధన చేస్తున్నది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ దాదాపు 8 వేల హిమానీనదాలు ఉన్నాయి. అందులో దాదాపు 200 ప్రమాదకరంగా ఉన్నాయి. వారి అంచనా ప్రకారం 2100 నాటికి భూమి ఉష్ణోగ్రత 2 డిగ్రీలు పెరిగితే ఇక్కడి హిమానీనదాలు 75 శాతం కనుమరుగవుతాయి. జూన్ 16–-17, 2013 సమయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వినాశకరమైన వరదలు సంభవించాయి, దాని తర్వాత పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి.
2004 సునామీ తర్వాత ఇది అత్యంత ఘోరమైన విపత్తు. ఇదంతా చోరాబరి హిమానీనదం వద్ద ప్రారంభమైంది. ఈ హిమానీనదం హిమాలయాలలోని 6,940 మీటర్ల కేదార్‌నాథ్ శిఖరం వాలుపై ఉంది. దీని పొడవు 7 కి.మీ, దాని బేసిన్ ప్రాంతం 38 చదరపు కి.మీ, మంచు కవచం 5.9 చదరపు కి.మీ. ఇది రెండు నీటి వ్యవస్థలకు నీళ్లు అందిస్తుంది. – ఒకటి మందాకిని (3,865 మీటర్ల వద్ద), మరొకటి చోరాబరి సరస్సు (3,835 మీటర్ల వద్ద). జూన్ 16న మేఘాల విస్ఫోటనం వల్ల సరస్సు వేగంగా నిండి పొర్లిపోయింది. ఈ సరస్సు అలకనందకు ఎగువన ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పట్లో కూడా ప్రాణ, ఆస్తి నష్టం చాలా జరిగింది. మానవుల అవగాహనకు, మేధస్సుకు, భారీ ఆనకట్టలను క్షణాలలో తుత్తునీయలు చేసే శక్తి ఈ వరద ప్రవాహాలు సంతరించుకుంటున్నాయి.
‘హిమాలయన్ బ్లాక్’ లేదు
భూమిలో వస్తున్న సహజ మార్పుల వల్ల భూమి పొరలు ఇంకా కదులుతూనే ఉన్నాయి. వాటి కదలికల పర్యవసానమే భూకంపాలు. హిమాలయాలు అస్థిరంగా ఉన్నాయి అని తెలిసినా ఇక్కడ నిర్మాణాలు, ప్రాజెక్టులు చేపట్టిన తరువాత ఏర్పడుతున్న పరిణామాలు ఎదుర్కోవలసిన పరిస్థితి కల్పిస్తున్నది ఎవరు? ప్రపంచ వాతావరణ సదస్సులలో (సీఓపీ) హిమాలయాల పట్ల ప్రత్యక్ష దృష్టి కొరవడింది. నేపాల్ దేశం నష్ట పరిహారం కోరిన నేపథ్యంలో మూడో ధృవం, పుడమి ఉమ్మడి ఆస్తి మీద లక్ష్యం లేకపోవడం గురించి అలోచించాల్సిందే. సీఓపీ చర్చలు ప్రపంచ ఉద్గారాల లక్ష్యాలు, క్లైమేట్ ఫైనాన్స్ చుట్టూ తిరుగుతున్నాయి.
హిమాలయ దేశాలు (భారతదేశం, నేపాల్, భూటాన్, చైనా, పాకిస్తాన్) ప్రతి ఒక్కరు విడివిడిగా ఈ సదస్సుల చర్చలలో పాల్గొంటున్నారు. కాబట్టి హిమాలయాల ఎజెండాను ముందుకు తెచ్చే ఏకీకృత ‘హిమాలయన్ బ్లాక్’ లేదు. వాతావరణ సదస్సులలో తీరప్రాంత వరదలు, ఎడారీకరణ, శక్తి పరివర్తనలు వంటి అంశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. హిమాలయ వాతావరణ ప్రభావాలు (హిమానీనదం, రుతుపవనాల మార్పులు, నదీ ప్రవాహాలు) మోడల్ చేయడం కష్టం కనుక కర్బన ఉద్గారాలతో పోలిస్తే సాధారణ లక్ష్యాలలో ఉంటాయి.
నేపాల్ నష్టపరిహారం డిమాండ్ సమంజసమే
హిమాలయ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం చైనా ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నది. టిబెట్ ఆక్రమణ ఇందులో భాగమే. పాకిస్తాన్, నేపాల్ దేశాలను తన ప్రభావిత పరిధిలోకి తెచ్చుకునేందుకు అనేక ప్రాజెక్టులు కూడా చేపట్టింది. టిబెట్ ప్రాంతంలో రకరకాల భారీ ప్రాజెక్టులు చేపడుతున్నది. భారత్ కూడా హిమాలయ ప్రాంతంలో లేదా దాని ప్రభావిత ప్రాంతంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో భారీ ప్రాజెక్టులు చేపట్టింది. రెండు దిగ్గజ దేశాలను ఒక దగ్గరికి చేర్చి చర్చించి ఒక సామరస్య, ప్రణాళికాబద్ధ, ప్రకృతి అనుకూల అభివృద్ధికి నాంది పలికే అంతర్జాతీయ వేదిక లేకపోవడం దురదృష్టకరం. కాప్ 31 సదస్సు ఈ ఏడాది నవంబర్ మాసంలో జరగబోతున్నది. గత 5-6 సదస్సులలో ప్రపంచ ఉమ్మడి ఆస్తుల మీద, కర్బన ఉద్గారాలు తగ్గించడానికి, ప్రణాళికాబద్ధంగా కాలుష్యం తగ్గించడానికి అనేక ఒప్పందాల మీద చర్చలు జరుగుతున్నాయి.
అయితే, వీటిలో ఎక్కడా హిమాలయ ప్రాంతాల ప్రస్తావన లేదు. అయితే, నేపాల్ ప్రభుత్వం జరిగిన నష్టానికి కర్బన ఉద్గారాల వల్ల పెరిగిన భూమి ఉష్ణోగ్రత తదనంతర హిమానీ నదులవల్ల ఏర్పడిన ప్రకృతి వైపరీత్యంగా భావిస్తూ కాలుష్యకారక దేశాల నుంచి పరిహారం కోరుతున్నది. నేపాల్ భారత, చైనా దేశాలను కలుపుతూ నష్టపరిహారం ఆయా దేశాలు ఇవ్వాలని కోరింది. బహుశ ఈ తరహా వాదన మొట్టమొదటిసారి రావడం.
దీని పర్యవసానం ప్రపంచ రాజకీయాల మీద ఎలా ఉంటుందో మున్ముందు గమనించాలి. ఆఫ్రికన్ దేశాలు కూడా పర్యావరణ విధ్వంసం వల్ల తాము ఎదుర్కొంటున్న నష్టాలకు కాలుష్య కారకులు స్పందించాలని కోరుతూ ఈజిప్ట్ లో జరిగిన కాప్ సదస్సులో ఒక ప్రత్యేక నిధి సాధించారు. నేపాల్ చేస్తున్న డిమాండ్.. మొదటిసారి ఆసియా ఖండంలో ఒక ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ, ఉమ్మడి ఆస్తి పట్ల జరుగుతున్న హాని, దానివల్ల తాము ఎదుర్కొంటున్న నష్టం గురించి ప్రస్తావించింది. నేపాల్ ప్రపంచ దేశాలను పరిహారం కోరడం సమంజసమే.
గ్లోబల్ క్లైమేట్ హాట్‌స్పాట్
హిమాలయాలను ‘సొంతం’ చేసుకున్న 8 దేశాలు.. పుడమికి కీలకంగా మారిన ఈ ప్రకృతి వ్యవస్థ సుస్థిరతమీద దృష్టి పెట్టడం లేదు. ఇక్కడ ఆయా దేశాల విధానకర్తలు చేపడుతున్న విధ్వంసకర కార్యకలాపాలను అడ్డుకునే శక్తి స్థానికులకు లేదు. ఇటీవల జరిగిన వరద నష్టం సామాన్యమైనది కాదు. సామాన్యులు అనేకులు ఇండ్లు, వాకిలి, ప్రాణాలు, జీవనోపాధులు కోల్పోయారు. హిమాలయ పర్వత శ్రేణులలో ప్రకృతితో మమేకమై జీవిస్తున్న స్థానిక ప్రజల జీవనాన్ని కాలరాస్తూ, అప్రజాస్వామికంగా ‘అభివృద్ధి’ రచన చేస్తున్నాయి ఇక్కడి ప్రభుత్వాలు.
దివరకటి, ఇప్పటి, మున్ముందు ఏర్పడే ప్రకృతి వైపరీత్యాలకు వివిధ ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులే కారణం. ఈ పరిస్థితి మారాలి. రాబోయే కాప్ 31 సదస్సులో ఇక్కడి
8 దేశాలు ఒక హిమాలయ వాతావరణ కూటమిగా ఏర్పడి ఈ ప్రాంతాన్ని ‘గ్లోబల్ క్లైమేట్ హాట్‌స్పాట్’గా ప్రకటించడానికి ప్రయత్నాలు చెయ్యాలి. హిమాలయ పతనం రుతుపవనాలు, వ్యవసాయం, భౌగోళిక రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూపించే బలమైన సైన్స్- పాలసీ కమ్యూనికేషన్ తయారుచేసి, అంతర్జాతీయ చర్చలలో దాని ప్రాముఖ్యతను పెంచాల్సిన అవసరం ఉన్నది.
– డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు