Reading Time: 2 minutes
Vande Bharat Express: తిరుపతికి మరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. శ్రీవారి భక్తులకు అదిరిపోయే సూపర్ న్యూస్..

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుపతికి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. తిరుపతి మీదుగా ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లేవారికి ఇవి ఎంతోగానే ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు కూడా అందుబాటులోకి రానుండటం భక్తులకు శుభవార్తగా చెప్పవచ్చు. త్వరలో అందుబాటులోకి రానున్న రైలు కర్ణాటకలోని శివమొగ్గ టౌన్-తిరుపతి మధ్య సర్వీసులు అందించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వందే భారత్ రైలుకు రైల్వేబోర్డు నుంచి సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు ప్రవేశపెట్టేందుకు రైల్వేబోర్డు ప్రతిపాదన రూపొందించిందని, ఈ మేరకు తాను రాసిన లేఖకు రైల్వేశాఖ నుంచి సమాచారం వచ్చినట్లు పేర్కొన్నారు.

తిరుపతికి మరో వందే భారత్

ఇటీవల తిరుపతి రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ట్రైన్‌కు ట్రయల్ రన్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఒక రైలు వచ్చి తిరుపతి స్టేషన్‌లో ఆగింది. దీంతో త్వరలో మరో కొత్త వందే భారత్ రైలు తిరుపతికి రానుందనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు అది నిజమైంది. దీనికి సంబంధించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తన ఎక్స్ ఖాతాలో వివరాలు పొందుపర్చారు. “శివమొగ్గ టౌన్-తిరుపతి-శిమమొగ్గ టౌన్ మధ్య కొత్త వందే భారత్ రైలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే బోర్డు ప్రతిపాదన తీసుకొచ్చింది. నేను రైల్వే బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖ రాయగా.. సానుకూల స్పందన వచ్చింది. ఇందుకుగాను రైల్వే బోర్డు చైర్మన్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను” అని గురుమూర్తి తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు

“ఈ కొత్త వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే.. శివమొగ్గ-తిరుపతి మధ్య వేగవంతమైన, సౌకర్యవంతమైన రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య రైలు కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. తిరుపతికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. విద్య, వైద్యం, ఉద్యోగం, ఇతర అవసరాల కోసం ప్రయాణించే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాంతీయ అభివృద్దికి, ఆర్ధిక వృద్దిక కూడా దోహదపడుతంది” అని గురుమూర్తి తెలిపారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ త్వరలో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సన్నద్దమవుతోంది. విశాఖపట్నం-బెంగళూరు మధ్య తొతది స్లీపర్ ట్రైన్ రానుందని తెలుస్తోంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ తీసుకొచ్చింది.