Reading Time: 2 minutes
Kangana Ranaut Mandi Mplads Funds Officials Development Work

బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నిధుల కింద అభివృద్ధి పనులకు విడుదలైన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవడంపై అధికారులను నిలదీశారు. మండి జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమె అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రూ.11 కోట్ల నిధులు..

మండి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఎంపీ నిధుల కింద సుమారు రూ.11 కోట్లు విడుదలైనప్పటికీ.. అందులో చాలా మొత్తాన్ని అధికారులు ఖర్చు చేయలేదని కంగనా ఆరోపించారు. దాదాపు రెండేళ్లు గడిచినా నిధులు పూర్తిస్థాయిలో వినియోగించలేదని ఆమె పేర్కొన్నారు. మార్చి-ఏప్రిల్ నాటికి మొత్తం ప్రాంతంలో రూ.1 కోటి కంటే తక్కువ నిధులు మాత్రమే వినియోగించారని, మండి ప్రాంతంలో సుమారు రూ.5.5 కోట్ల నిధులు అందుబాటులో ఉండగా.. కేవలం రూ.50-60 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు అధికారుల నుంచి సమాచారం అందిందని ఆమె తెలిపారు.

‘ఇలాంటి హామీలు ఇక వద్దు’

అధికారులు పదేపదే హామీలు ఇవ్వడం మానేసి.. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కంగనా సూచించారు. “ఈ పనికిరాని హామీలు నాకు చెప్పొద్దు. ప్రతి DISHA కమిటీ సమావేశంలోనూ నేను ఇవే హామీలు వింటున్నాను” అని ఆమె అధికారులను నిలదీశారు. గతంలో కూడా MPLADS నిధులపై తాను ప్రశ్నించినప్పుడు ఎలాంటి సమస్య లేదని, తమ నిధుల్లో 90 శాతం ఇప్పటికే అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నామని అధికారులు చెప్పారని కంగనా గుర్తుచేశారు. అయితే బయటి సంస్థలు నిర్వహించిన వివరణాత్మక సర్వేల ద్వారా వాస్తవ పరిస్థితి బయటపడిందని ఆమె పేర్కొన్నారు.

ఇకపై సమస్యలను పరిష్కరిస్తామని చెప్పే హామీలు తనకు అవసరం లేదని కంగనా స్పష్టం చేశారు. “సమస్యను పరిష్కరిస్తామని చెప్పే సమయం అయిపోయింది. ఇవి రెండేళ్ల నాటి సమస్యలు. ఏడాదిన్నర నుంచి రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు పని పూర్తి చేసి.. పూర్తయిందని నాకు నివేదిక ఇవ్వండి” అని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు ఏం చెప్పాలి?

మీడియా ముందు తన నియోజకవర్గం గురించి తాను ఏం చెప్పాలని ప్రశ్నించారు. “ప్రజలు ఇక్కడికి వచ్చి కేవలం జీతాలు తీసుకోవడానికే వస్తున్నారని నేను మీడియా ముందు చెప్పాలా? మన రాష్ట్ర ప్రజల గురించి, వారి పని తీరు గురించి నేను ఏం చెప్పాలి? ఇంత సోమరితనం, అసమర్థతతో ఈ కుర్చీల్లో కూర్చున్నారని జాతీయ మీడియా ముందు చెప్పాలా? నా సొంత నియోజకవర్గం, నా సొంత కొండ ప్రాంత ప్రజల గురించి నేను అలా చెప్పాలా?” అని ఆమె ప్రశ్నించారు.

మండిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై ప్రజలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారని కంగనా అన్నారు. మరోవైపు అధికారులు మాత్రం తన కార్యాలయాల్లో కూర్చొని నవ్వుతూ, తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు. మండిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే వేగవంతం చేయాలని అధికారులను కంగనా ఆదేశించారు. అందుబాటులో ఉన్న MPLADS నిధులను సక్రమంగా వినియోగించి, అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు.