
పిల్లలు బడినుంచి ఇంటికి రావడంతోనే అమ్మా తింటానికి కావాలని మారాం చేస్తుంటారు. అప్పుడు ఇంట్లో పకోడీలు.. శాండ్ విచ్ లు పెడతాం.. రోజు ఇవే పెడితే పిల్లలకు బోరు కొడుతుందని. అయితే కరకరలాడే వెరైటీ వంటకాలు పెడితే చాలా ఇష్టంగా లాగిస్తారు. మరి అలాంటి స్నాక్స్ ను మునగతో తయారు చేయొచ్చు.. రుచి అమోఘంగా ఉంటుంది. మరి మునగస్నాక్స్ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా మరి..!
సాయంత్రం అవ్వగానే వేడి వేడి టీతో పాటు కరకరలాడే స్నాక్ ఏదైనా తినాలనిపించడం సహజం. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే రోజూ చేసుకునే పకోడీలు, బజ్జీలు, శాండ్ విచ్ లకు బదులుగా ఈసారి కాస్త కొత్తగా ట్రై చేయాలనుకుంటే..క్రిస్పీ మునగకాయ స్నాక్ మీకు బెస్ట్ ఛాయిస్.
సాధారణంగా మునగకాయ అనగానే మనకు సాంబార్ లేదా కూర మాత్రమే గుర్తొస్తాయి. కానీ, సరైన మసాలాలు దట్టించి ఇలా స్నాక్ లా చేస్తే దాని రుచి అమోఘంగా ఉంటుంది.
మునగకాయ స్నాక్ తయారీకి కావలసిన పదార్థాలు
- మునగకాయలు – 2
- శనగపప్పు – 50 గ్రాములు
- పచ్చి బియ్యం – అర కప్పు
- పచ్చిమిర్చి – 2
- జీలకర్ర పొడి – 1 టీస్పూన్
- ధనియాల పొడి – 1 టీస్పూన్
- ఆమ్చూర్ పొడి – 1/2 టీస్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- నూనె – వేయించడానికి సరిపడ
- కొత్తిమీర – కొద్దిగా
మునగకాయ స్నాక్ తయారీ విధానం
మునగకాయలను శుభ్రంగా కడగాలి. రెండు అంగుళాల పొడవు ఉండేలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ ముక్కలను ఒక కుక్కర్ లో వేసి ఒక మాదిరిగా ఉడకబెట్టాలి. మరీ మెత్తగా ఉండకూడదు. ఆ తరువాత నీటిని వడకొట్టి.. ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు శనగపప్పు.. బియ్యాన్ని 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తరువాత మిక్సీ గిన్నెలో నానపెట్టిన శనగపప్పు.. బియ్యం.. జీలకర్ర పొడి,ఆమ్ చూర్ పొడి,ధనియాల పొడి,పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అయితే మరీ పల్చగా.. మరీ గట్టిగా ఉండకూడదు.
ఇప్పుడు స్టవ్‌పై కళాయి పెట్టాలి. అందులో నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు ఉడకబెట్టిన మునగకాయ ముక్కలను రుబ్బిన పిండిలో బాగా ముంచాలి. ఈ పిండి ముక్కకు అన్ని వైపులా దట్టంగా పట్టేలా చూసుకొని కాగుతున్న నూనెలో వేయించాలి.
మీడియం ఫ్రేమ్ లో వేయిస్తూ ముక్కలను అటూ ఇటూ తిప్పుతూ లేత బంగారు రంగులోకి వచ్చేలా వేయించాలి. అంతే మునగకాయ స్నాక్ రెడీ. – ఇవి కరకరలాడతాయి. వీటిని టీతో కలిపి తింటే ఆహా ఏమి రుచిలే అంటూ లొట్టలేయాల్సిందే..మరి మునగ స్నాక్స్ ను ఓ సారి ట్రై చేద్దామా..!