Reading Time: 2 minutes
Off The Record Over Kavali Crdite War

అభివృద్ధి విషయంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య క్రెడిట్‌ వార్‌ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రతిపాదనలు తనవేనని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు. మరి అప్పుడే పనులు ఎందుకు చేయలేదని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. ఆ రెండు పార్టీలకు చెందిన సోషల్‌ మీడియా మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. మీరు ఒక్క పోస్ట్ పెడితే… మేము రెండు పోస్టులు పెడతామన్నట్లుగా చెలరేగిపోతున్నారు. ఇదే సమయంలో ఫ్యాన్ పార్టీలోని లుకలుకలను సైకిల్ పార్టీ హైలెట్ చేస్తోంది. వైసీపీ ఆవిర్భావం తరువాత నెల్లూరు జిల్లా కావలిలో ఆ పార్టీ రెండుసార్లు గెలిచింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి… టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై వరుస కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్ళు ఆయన అజ్ఞాతంలో కూడా ఉన్నారు. అనారోగ్య సమస్యలు, కేసులతో సతమతమైన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కొంతకాలం నియోజకవర్గానికి ముఖం చాటేశారు. ఈ మధ్య కాలంలో తరచూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అధికార పార్టీకి పోటీగా కార్యక్రమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నా.. అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడంలేదట. పార్టీకి దూరంగా ఉన్న నేతల్ని కలుపుకొని వెళ్లడంలో ప్రతాప్ కుమార్ రెడ్డి విఫలమవుతున్నారట. ఇదే సమయంలో మరో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో ఉన్న విభేదాల నేపథ్యంలో ఆయన వర్గం కూడా కార్యక్రమాలకి వెళ్లడంలేదట. తన టికెట్‌కి పోటీ వస్తారని భావించిన ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి… విష్ణువర్ధన్ రెడ్డితో టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తూ ఉన్నారనేది ఆయన అనుచరుల మాట. దగదర్తి, బోగోలు, అల్లూరు మండలాలలో ఉండే కీలక నేతలు ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి తీరుపై అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ ఫ్యాన్ పార్టీలో జరుగుతోంది. ఈ క్రమంలోనే దగదర్తిలో తాళ్లూరి వర్గం పార్టీ కార్యక్రమాలకు రావడమే మానేసిందట. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులకు క్లియరెన్స్ తెప్పించి పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంటర్ అయ్యారట.

ఆ అభివృద్ధి పనులను తానే శాంక్షన్ చేయించానని అంటున్నారట. తాము అధికారంలో ఉన్న సమయంలోనే పనులకు ప్రతిపాదనలు పెట్టానని… వాటిని ఇప్పుడు ఎమ్మెల్యే పూర్తి చేస్తున్నారంటూ చెబుతున్నారట. కొత్తగా ఎమ్మెల్యే చేసిన పనులేమీ లేవంటూ మాజీ ఎమ్మెల్యే క్రెడిట్‌ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారట. దీనిపై టీడీపీ సోషల్ మీడియా కౌంటర్ అటాక్ చేస్తోంది. 2020లో శాంక్షన్ అయితే… 2024 దాకా ఎందుకు పనులు స్టార్ట్ చేయలేదన్న ప్రశ్నలు లేవనెత్తుతోంది. కావలి – తుమ్మల పెంట రోడ్డునే టీడీపీ ఉదాహరణగా చూపుతోంది. ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి చేయలేని అభివృద్ధిని తాము చేస్తుంటే క్రెడిట్‌ మాత్రం తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడుతోంది టీడీపీ. కలుగోలమ్మ బ్రిడ్జి విషయంలో కూడా శిలాఫలకం వేసి వదిలేస్తే.. తామే వాటిని పూర్తి చేస్తున్నామని టీడీపీ అంటోంది. మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ఉండే రోడ్డు కూడా తామే వేశామని.. ఐదేళ్లు అధికారంలో ఉన్న ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి తన ఇంటి ముందు ఉన్న రోడ్డు కూడా గుర్తు రాలేదా అంటూ టీడీపీ గట్టిగానే నిలదీస్తోందట. ఈ క్రమంలోనే ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి చేసిన తప్పిదాలను, పార్టీలోని లుకలుకలను TDP సోషల్ మీడియా హైలెట్ చేస్తూ.. జనాల్లోకి తీసుకెళ్తోందట. దీంతో నిధుల మంజూరుపై వైసీపీలో కూడా చర్చ మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. శాంక్షన్ అయిన, మంజూరు చేయించుకున్న పనులను అప్పుడే పూర్తి చేసి ఉంటే ఇప్పుడు టీడీపీకి టార్గెట్ అయ్యేవాళ్ళమే కాదన్న చర్చ ఫ్యాన్ పార్టీలో జరుగుతోందట. అభివృద్ధి పనులకు అధిష్టానం ఆశించిన స్థాయిలో సపోర్ట్ లేకపోవడంతోనే ఇదంతా జరిగిందన్న మాటలు ఫ్యాన్‌ పార్టీలో వినిపిస్తున్నాయట. జనాల అటెన్షన్ ఉన్న పనులను సకాలంలో స్టార్ట్ చేయించి.. పూర్తి చేయలేకపోయామన్న అవేదన వైసీపీలో ఉందట. ప్రస్తుతం అవే పనులు ఎమ్మెల్యే చేయిస్తూ ఉంటే.. తానే నిధులు మంజూరు చేయించానని.. పనులకు ప్రతిపాదనలు పెట్టానని చెప్పుకుంటున్నా.. ఐదేళ్లు ఎందుకు చెయ్యలేకపోయావన్న ప్రశ్నలు వస్తున్నాయని వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారట. ఏదో ఒక రూపంలో జనాల్లో చర్చ జరిగితే చాలులే అనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారట.