
హైదరాబాద్: మహిళల ఉచిత బస్సు స్కీమ్‌పై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు మహిళలకు ఉచిత బస్సు పథకం ఉంటుందని ప్రకటించారు. ఇవాళ కోటి మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం చూసి కొందరు తట్టుకోలేకపోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రద్దు చేయాలని ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వీలైన ప్రతిచోట మహిళలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
పదేండ్లలో కేసీఆర్ ఎప్పుడైనా మహిళల గురించి ఆలోచించాడా అని ప్రశ్నించారు. మహిళలకు పెట్రోల్ బంకులు, సోలార్ నిర్వహణ అప్పగించామని చెప్పారు. శనివారం (సెప్టెంబర్ 5) నకిరేకల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజుల పాలన పూర్తి అయ్యిందని తెలిపారు. వెయ్యి రోజుల్లో అద్భుతమైన పథకాలు అమలు చేశామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొందరు దుర్మార్గులు మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలన.. మా 1000 రోజుల పాలన బేరీజు వేసుకోండని ప్రజలను కోరారు. గత ప్రభుత్వ పథకాలను రద్దు చేయకుండా కొనసాగిస్తామన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చిందని అన్నారు.
►ALSO READ | కొండా సురేఖతో అందుకే రాఖీ కట్టించుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. చివరకు నిరుద్యోగులు, రైతుల ఉసురు తగిలి కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని.. అలాగే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్‌తో పాటు పలు అభివృద్ధి పనులు చేశామన్నారు.