Reading Time: < 1 minute
Tg Safe Paneer Dairy Raids Hyderabad Food Safety

TG SAFE : కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు కొరడా ఝుళిపించారు. హైదరాబాద్ నగర పరిధి, పరిసర ప్రాంతాల్లోని పనీర్, పాల ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. 12 బృందాలుగా ఏర్పడిన అధికారులు మొత్తం 14 డెయిరీ యూనిట్లలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కొన్ని కేంద్రాల్లో పనీర్ అనలాగ్స్ తయారీకి లూజ్ పామ్ ఆయిల్, గ్లిసరాల్ మోనోస్టియరేట్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. పలుచోట్ల బొద్దింకలు, ఈగల బెడదతో పాటు పరిశుభ్రత, పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించకపోవడం, పాల సేకరణ రికార్డులు లేకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి.

 

కల్తీపై అనుమానంతో అధికారులు 21 ఆహార నమూనాలు సేకరించారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం రూ.7,19,340 విలువైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు ఒక టన్ను లూజ్ పామ్ ఆయిల్, 476 కిలోల గ్లిసరాల్ మోనోస్టియరేట్, 1,760 ప్యాక్‌ల కుకింగ్ క్రీమ్, 150 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉన్నాయి. మరోవైపు రెండు సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు, మరో రెండు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. లక్ష్మీ ఫుడ్స్, ధనలక్ష్మీ డెయిరీ ప్రొడక్ట్స్, నటరాజ్ మిల్క్ అండ్ మిల్క్ ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేసి, కార్యకలాపాలు నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు కొనసాగుతాయని TG SAFE స్పష్టం చేసింది.