Reading Time: 3 minutes
Inspiring Story: వైకల్యాన్ని ఓడించి.. కాళ్లనే చేతులుగా మార్చుకుని.. కాళ్లతోనే చదివి టీచర్‌గా మారాడు!

సింహాచలం నాయుడు పుట్టుకతోనే రెండు చేతులు, ఒక కాలుకు వైకల్యంతో జన్మించారు. బిడ్డను ఎలా పెంచాలి? భవిష్యత్తులో ఎలా జీవిస్తాడు? అనే ఆందోళన ఆయన తల్లిదండ్రుల్లో ఉండేది. అయితే సింహాచలం జీవితాన్ని మార్చిన తొలి అడుగు ఆయనకు మూడేళ్ల వయసులో పడింది. ఆయన బాబాయ్‌ జామి నర్సింగరావు ఓ మ్యాగజైన్‌లో ఒక వ్యక్తి కాలుతో రాస్తున్న కథనాన్ని చూశారు. అదే విధంగా సింహాచలం కూడా కాళ్లతో రాయడం నేర్చుకోవచ్చని భావించారు. అప్పటి నుంచి ఆయనకు చిన్న చిన్న సుద్దముక్కలు, చాక్‌పీసులు కాళ్ల మధ్య పెట్టి గీతలు గీయించడం ప్రారంభించారు. గోడలపై, నేలపై, తలుపులపై, కిటికీలపై సున్నాలు, గీతలు గీయిస్తూ సాధన చేయించారు. ఆ చిన్న ప్రయత్నమే కొద్దికాలానికి అక్షరాలుగా మారింది. సుమారు ఐదేళ్ల వయసుకే పెన్ను, పెన్సిల్‌ను కాలితో పట్టుకుని రాయడం నేర్చుకున్నారు.

కాళ్లతోనే చదువు.. స్క్రైబ్‌ అవసరం లేదు

సింహాచలం తన ప్రాథమిక విద్యను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే స్నేహితులతో కలిసి పూర్తి చేశారు. మిగతా విద్యార్థులు బెంచీలపై కూర్చుని రాస్తే.. ఆయన మాత్రం నేలపై కూర్చుని కాలితో నోట్స్‌ రాసుకునేవారు. అలా ఇంటర్మీడియట్‌, డి.ఎడ్‌, డిగ్రీతో పాటు బి.ఎడ్‌ కూడా పూర్తి చేశారు. తన చదువు ప్రయాణంలో ఆయన ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఏ బోర్డు పరీక్షలోనూ స్క్రైబ్‌ సహాయం తీసుకోలేదు. ప్రతి పరీక్షను తన కాళ్లతోనే, నిర్ణీత సమయంలోనే పూర్తి చేశారు. ‘నా పనులు నేను చేసుకోవాలంటే కాళ్లనే చేతులుగా భావించాలి. ఏ పని అయినా నా కాళ్లతోనే చేయాలి’ అనే ఆలోచనను చిన్నతనంలోనే అలవర్చుకున్నారు. ఇతరులు చేతులతో రాస్తున్నారు.. తాను కాలితో రాస్తున్నాననే బాధను ఆయన ఎప్పుడూ తనపైకి రానివ్వలేదు. జీవితంలో ముందుకు సాగాలంటే పరిస్థితులకు అనుగుణంగా తాను మారాల్సిందేనని నిర్ణయించుకున్నారు.

ఆరేళ్ల కష్టం.. డీఎస్సీలో ఓపెన్‌ కేటగిరీ ర్యాంక్‌

చదువు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది సింహాచలం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే తన పరిస్థితుల కారణంగా బయటకు వెళ్లి కోచింగ్‌ తీసుకోవడం అంత సులభం కాలేదు. అందుకే ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులు, యూట్యూబ్‌ ద్వారా చదువుకున్నారు. తన బాబాయ్‌, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామంలోని టీచర్ల నుంచి మార్గదర్శకత్వం తీసుకున్నారు. అలా సుమారు ఆరేళ్లపాటు కష్టపడి చదివారు. చివరకు 2018 మెగా డీఎస్సీలో ఓపెన్‌ కేటగిరీలో జిల్లా స్థాయిలో 320వ ర్యాంకు సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందారు. తనను కొందరు ‘డిసెబిలిటీ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం సులభంగానే వస్తుంది’ అంటూ చులకనగా మాట్లాడేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ మాటలను ప్రతికూలంగా తీసుకున్న ఆయన.. ఎలాగైనా కష్టపడి ఓపెన్‌ కేటగిరీలోనే ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చివరకు అదే చేసి చూపించారు.

విద్యార్థిగా కాలుతో రాశారు.. ఇప్పుడు అదే కాలుతో పాఠాలు చెబుతున్నారు

ఒకప్పుడు విద్యార్థిగా నేలపై కూర్చుని కాలుతో రాసుకున్న సింహాచలం.. ఇప్పుడు అదే కాళ్లతో తరగతి గదిలో బోర్డుపై రాస్తూ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఉపాధ్యాయుడిగా పాఠశాలలో చేరిన తొలినాళ్లలో తన బోధనా విధానాన్ని విద్యార్థులు ఎలా స్వీకరిస్తారోనని కొంత భయం ఉండేదని ఆయన తెలిపారు. కానీ ఆయన తరగతి గదిలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల్లో ఆశ్చర్యంతో పాటు గౌరవం కూడా పెరిగింది. ‘సార్‌ బోర్డు మీద ఎలా రాస్తారు? ఎలా పాఠాలు చెబుతారు?’ అని మొదట ఆశ్చర్యపోయిన విద్యార్థులు.. ఆయన బోధనను చూసిన తర్వాత ఎంతో ప్రేరణ పొందారు. తోటి ఉపాధ్యాయులు కూడా సింహాచలం పనితీరును ప్రశంసిస్తున్నారు. చేతులు లేకపోయినా ఇతర ఉపాధ్యాయులతో సమానంగా, కొన్ని సందర్భాల్లో అంతకుమించి పనిచేస్తున్నారని వారు చెబుతున్నారు. సింహాచలం పనిచేస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. డీఎస్సీలో మెరిట్‌ ద్వారా ఎంపికై వచ్చిన ఉపాధ్యాయుడు. కాలుతో సంతకం చేయడం చూసి చాలా సంతోషంగా అనిపించింది. మిగతా టీచర్లతో సమానంగా ఆయన తన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మాకు దొరికిన ఆణిముత్యం అని ఓ ఉపాధ్యాయుడు పేర్కొన్నారు. విద్యార్థులు కూడా ఆయనను చూసి ఎంతో ప్రేరణ పొందుతున్నారు. చేతులు లేకపోయినా కాలుతో రాయడం, బోర్డుపై పాఠాలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయామని, ఆయన నుంచి ఎంతో నేర్చుకుంటున్నామని చెబుతున్నారు.

సింహాచలం ఉద్యోగ జీవితంలో ఆయన తండ్రి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతిరోజూ తండ్రే బైక్‌పై పాఠశాలకు తీసుకెళ్లి, సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకొస్తారు. తరగతి గదిలో మాత్రం తన కాళ్లే తన చేతులుగా మారుతాయని సింహాచలం చెబుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించడంతో తన ప్రయాణం ముగిసిపోలేదని సింహాచలం అంటున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే సివిల్స్‌ పరీక్షకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఐదారేళ్లలో సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు. చాలామంది మాలో ఉన్న డిసెబిలిటీని మాత్రమే చూస్తారు. కానీ మాలో ఉన్న ఎబిలిటీని చూడరు. మేము వైకల్యంతో కనిపించినా.. అందరిలాగే ఎన్నో పనులు చేయగల సామర్థ్యం మాలో ఉంది. ఏదైనా సాధించాలనే దృఢ సంకల్పం ఉంటే మేము కూడా విజయాన్ని అందుకోగలం అని సింహాచలం నాయుడు చెబుతున్నారు.

సింహాచలం కథ కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వ్యక్తి కథ కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా, మనపై మనకు నమ్మకం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన ఓ స్ఫూర్తిదాయక ప్రయాణం. చిన్నతనంలో సుద్దముక్కతో గీతలు గీసిన కాళ్లే.. నేడు బ్లాక్‌బోర్డుపై అక్షరాలు రాస్తున్నాయి. ఒకప్పుడు తన భవిష్యత్తు గురించి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులే.. ఇప్పుడు ఆయన విజయాన్ని గర్వంగా చూస్తున్నారు. ‘చేతులు లేవు’ అనే లోటును పట్టించుకోకుండా.. ‘నాకు కాళ్లు ఉన్నాయి, వాటితోనే సాధిస్తాను’ అనే నమ్మకంతో ముందుకు సాగిన సింహాచలం నాయుడు ఎంతోమందికి నిజమైన స్ఫూర్తిగా నిలుస్తున్నారు.