
పర్వతం దగ్గరికి ఎవరూ వెళ్లకుండా పర్వతారోహకులు, సందర్శకులపై నిషేధం విధించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిపర్వతం నుంచి బూడిద భారీగా ఎగసిపడుతుండటంతో జకార్తాలోని సోకార్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మొత్తం 209 విమానాల రాకపోకలపై ప్రభావం పడగా, 22,800 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
విస్ఫోటనంతో ఏర్పడ్డ రెండు బూడిద మేఘాలు
జావా, సుమత్రా ద్వీపాల మధ్య ఉన్న సుండా జలసంధిలో ఉన్న అగ్నిపర్వతంలో ఆదివారం ఉదయం 3:53 గంటలకు 30 సెకన్ల పాటు విస్ఫోటనం సంభవించింది. పేలుడు కారణంగా రెండు భారీ బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. ఇందులో ఒక మేఘం దాదాపు 20 వేల అడుగుల ఎత్తుకు ఎగసిపడి ఈశాన్య దిశగా కదిలింది. ఈ బూడిద ప్రభావం జకార్తా, బాంటెన్, పశ్చిమ జావా ప్రాంతాలపై పడింది. రెండో బూడిద మేఘం ఏకంగా 50 వేల అడుగుల ఎత్తుకు చేరింది. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా వ్యాపించి బాంటెన్, లాంపంగ్, బెంగ్‌కులు, దక్షిణ సుండా జలసంధి, సుమత్రా పశ్చిమాన ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతాలపై ప్రభావం చూపింది.
సుకర్నో-హట్టా విమానాశ్రయంలో మొదట ఉదయం 5:30 గంటల వరకు విమానాలు నిలిపివేయాలని నిర్ణయించినా, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆంక్షలను ఉదయం 9:30 గంటల వరకు పొడిగించారు. విమానాశ్రయంలో రాత్రి పార్క్ చేసిన 170 విమానాలు అక్కడికక్కడే ఆగిపోయాయి. టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రయాణికులు డిమాండ్ చేయడంతో పాటు, చెక్-ఇన్ చేసిన సామాన్లను వెనక్కి తీసుకున్నారు.
సింగపూర్‌కు వెళ్లే విమానం పై ప్రభావం
సింగపూర్‌కు వెళ్లే విమానాలపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. హాంకాంగ్, సిడ్నీ, ఆమ్‌స్టర్‌డామ్, సియోల్, దోహా, కౌలాలంపూర్ వెళ్లే విమానాలు కొన్ని రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. లాంపంగ్, బాలి, సురబయ, మకాసర్ ప్రాంతాలకు వెళ్లే కొన్ని దేశీయ విమానాలు కూడా ప్రభావితమయ్యాయి. పడవలో వెళుతుండగా అగ్నిపర్వతం బద్ధలు కావడం చూసిన కొందరు, అతి సమీపం నుంచి చిత్రీకరించిన వీడియో వైరల్ గా మారింది.
వీడియోను ఇక్కడ చూడండి.
Insane footage shows Anak Krakatau erupting, filmed from a boat near the volcano pic.twitter.com/5IAf63WlE8
— Surajit (@surajit_ghosh2) September 5, 2026
తరలింపునకు ఇవ్వని ఆదేశాలు
ప్రస్తుతం ఈ అగ్నిపర్వతం బద్ధలవ్వడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు లేదా ఎవరికీ గాయాలైనట్లు అధికారిక సమాచారం రాలేదు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అధికారిక ఆదేశాలు జారీ కాలేదని తెలుస్తోంది. అగ్నిపర్వత క్రియాశీల క్రేటర్‌కు కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలని ప్రజలకు, పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేశారు. బూడిద కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని, కళ్ళ రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనవసరంగా బయటకు వెళ్లడం తగ్గించాలని, నీటి వనరులు కలుషితం కాకుండా వాటిని మూసి ఉంచాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
వెంటాడిన గత విషాదం
2018లో ఇదే అగ్నిపర్వతం బద్ధలవ్వడం వల్ల సంభవించిన సునామీ కారణంగా కనీసం 430 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ చారిత్రక అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం మళ్లీ బద్దలైన ఈ అగ్నిపర్వత పరిస్థితిని, బూడిద వ్యాప్తిని ఇండోనేషియా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చూడండి