Reading Time: 2 minutes
Manoj Bajpayee As Mahatma Gandhi Unrecognizable Look Creates Buzz

Mahatma Gandhi: మనోజ్ బాజ్‌పేయి ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో కఠినమైన, ఛాలెంజింగ్ పాత్రలు చేశారు. అయితే ఆయన తొలిసారి మహాత్మా గాంధీజీ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా బయటకు వచ్చిన ఆయన లుక్ చూస్తే మాత్రం ఒక్క క్షణం గుర్తుపట్టడం కూడా కష్టమే. గాంధీజీ రూపాన్ని మాత్రమే కాదు, ఆయన బాడీ లాంగ్వేజ్‌ను కూడా ఒంటబట్టించుకున్నట్టుగా కనిపిస్తున్న మనోజ్ బాజ్‌పేయి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుధీర్ మిశ్రా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం ‘గాంధీ అండ్ మై మదర్’ అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. అనుభవ్ సిన్హా నిర్మిస్తున్న ఈ సినిమా లక్నోలో షూటింగ్ సెప్టెంబర్ 4 నుంచి మొదలుపెట్టింది. ఇప్పటికే లక్నో జూ దగ్గరలోని నర్హీ ప్రాంతంలో తొలి సన్నివేశాలను చిత్రీకరించారు. 1940ల కాలాన్ని కళ్లముందుకు తీసుకురావడానికి పాతకాలం నాటి కార్లు, అప్పటి దుస్తులు, పాత సైన్ బోర్డులు వంటి వాటిని ఉపయోగించి ఆ కాలం వాతావరణాన్ని రీక్రియేట్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్న అసలు విషయం ఏంటంటే.. ఇది రెగ్యులర్ గాంధీ బయోపిక్ కాదు. గాంధీజీ పుట్టినప్పటి నుంచి ఆయన జీవితమంతా చూపించే సినిమా కాదని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తున్న సమయంలో జరిగిన ఒక కీలకమైన 21 రోజుల కాలాన్ని ఈ సినిమా కథగా తీసుకుంది. దేశం ఒకవైపు స్వాతంత్ర్య సంబరాల్లోకి అడుగుపెడుతుంటే, ఢిల్లీ కేంద్రంగా గాంధీజీ ఆ సమయంలో ఏం చేశారు? ఆయన మనసులో ఏం నడిచింది? అనే విషయాలను ఈ కథలో చూపించబోతున్నారు.

ఈ కథకు సుధీర్ మిశ్రాకు వ్యక్తిగతమైన అనుబంధం కూడా ఉంది. ఆయన తల్లి దుర్గా దేవేంద్రనాథ్ మిశ్రా చిన్నతనంలో గాంధీజీని కలిశారట. ఆ అనుభవం గురించి ఆమెతో దర్శకుడికి చాలా కాలం చర్చలు జరిగాయి. ఆమె 2022లో కన్నుమూయడానికి ముందు గాంధీజీపై సినిమా తీస్తానని సుధీర్ మిశ్రా మాట ఇచ్చినట్లు ఆయన గతంలో వెల్లడించారు. ఆ వ్యక్తిగత అనుబంధం నుంచే ఈ కథ రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు మనోజ్ బాజ్‌పేయి గాంధీజీ లుక్‌లో కనిపించిన ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో కూడా ఈ పాత్రపై ఆసక్తి పెరిగింది. ఆయన ముఖ కవళికలు, నడక, బాడీ లాంగ్వేజ్‌లో గాంధీజీని పోలి కనిపించేలా చేసిన మేకోవర్ ఇప్పుడు సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పేయితో పాటు సౌరభ్ శుక్లా, దివ్యా దత్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం లక్నోలో షూటింగ్ కొనసాగుతోంది. షూటింగ్ అక్టోబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని నిర్మాత అనుభవ్ సిన్హా తెలిపారు. సినిమా ఫైనల్ టైటిల్, విడుదల తేదీని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.