
HYDRAA : హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన చెరువుల్లో విగ్రహాల నిమజ్జనం చేయడానికి వీల్లేదంటూ వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. ఎన్టీవీ (NTV) ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ప్రజలు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
కాప్రా చెరువు మినహా అన్నింటిలో నిమజ్జనాలు
నగర పరిధిలోని ఒక్క కాప్రా చెరువు మినహా మిగిలిన అన్ని చెరువుల్లోనూ గణేష్ నిమజ్జనాలు యథావిధిగా జరుగుతాయని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కాప్రా చెరువును పర్యావరణ పరిరక్షణ , బయోడైవర్సిటీ అభివృద్ధి పనుల కోసం సిద్ధం చేస్తుండటం, అక్కడ నీరు లేకపోవడం వల్లే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ప్రత్యామ్నాయంగా బేబీ పాండ్స్ నిర్మాణం
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని రంగనాథ్ తెలిపారు. కాప్రా చెరువు వద్ద నిమజ్జనాల కోసం ప్రత్యేకంగా బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఉప్పల్ , ఐడీపీఎల్ చెరువుల వద్ద కూడా ప్రధాన నీటి వనరులను దెబ్బతీయకుండా, వాటి పక్కనే నిమజ్జనం కోసం ప్రత్యేకమైన పాండ్స్ నిర్మిస్తున్నామని చెప్పారు.
భక్తులకు, ఉత్సవ కమిటీలకు హైడ్రా స్వాగతం
హైడ్రా తరుపున వినాయక చవితి వేడుకలను, నిమజ్జన కార్యక్రమాలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న నిరాధారమైన వ్యాఖ్యలను నమ్మవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ , నిర్ణీత ప్రాంతాల్లో ప్రశాంతంగా నిమజ్జనాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.