Reading Time: 2 minutes
2 Crore Hanuman Ansh Film Eyes100 Crore Milestone With Strong Word Of Mouth

Hanuman Ansh: ఒక సినిమా హిట్ కొట్టాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరో, కోట్ల రూపాయల ప్రమోషన్ అవసరం లేదని ‘హనుమాన్ అంశ్’ మరోసారి నిరూపిస్తోంది. ఎలాంటి మార్కెటింగ్ హంగామా లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ ఆధ్యాత్మిక చిత్రం తొలిరోజు కేవలం రూ.10 లక్షలతో ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల మౌత్ టాక్ తో 100కోట్ల సినిమాగా అడుగులు వేస్తోంది. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఆదరణ అమాంతం పెరిగిపోయింది. క్రమంగా థియేటర్ల సంఖ్య పెరగడం, ప్రేక్షకుల స్పందనతో ‘హనుమాన్ అంశ్’ ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. ఇప్పుడు ఈ సినిమాకు క్రికెట్ ప్రపంచం నుంచి కూడా వస్తున్న ప్రశంసలు మరింత ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి. మాజీ భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సినిమా చూసి స్పందించడంతో ఈ మూవీ దర్శకుడు విశాల్ చతుర్వేది భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాదు ఇప్పుడు ఆయన మరో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, నటి అనుష్క శర్మ కూడా ఈ సినిమాను చూడాలని కూడా విజ్ఞప్తి చేశారు.

నీమ్ కరోలి బాబా జీవితం నుంచి స్ఫూర్తి పొంది విశాల్ చతుర్వేది రచించి, దర్శకత్వం వహించిన మూవీ ‘హనుమాన్ అంశ్’. మహారాజ్ జీగా భక్తులు ఆప్యాయంగా పిలుచుకునే నీమ్ కరోలి బాబా బోధనలు, ఆయన జీవితంలోని ఆధ్యాత్మిక కోణాలను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. శోభినవ్ సత్యా, విహాన్ షెడ్గే, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు ఇందులో నటించారు. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి రోజు దాదాపు రూ.10 లక్షల వసూళ్లతోనే సరిపెట్టుకుంది. మొదటి వారంలోనూ దాదాపు రూ.1.08 కోట్లకు పరిమితమైంది. రెండో వారంలో కూడా వసూళ్లు పెద్దగా పెరగలేదు. కానీ మూడో వారం నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన మౌత్ టాక్ సినిమాకు ప్రధాన బలంగా మారడంతో కలెక్షన్లు వేగంగా పెరిగాయి. సెప్టెంబర్ 3 నాటికి ఈ సినిమా ఇండియాలో రూ.61 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి 100 కోట్ల మార్కును కూడా దాటబోతున్నట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ సినిమాను చూడటం, ఆ తర్వాత తన స్పందనను పంచుకోవడంతో దర్శకుడు విశాల్ ఎమోషనల్ అయ్యారు. అసలు సెహ్వాగ్‌ను ప్రత్యేకంగా సంప్రదించి సినిమా చూడమని కోరలేదని, ఆయన స్వయంగా తన కుమారుడితో కలిసి సినిమాను చూసి స్పందించారని దర్శకుడు వెల్లడించారు. సెహ్వాగ్‌కు నీమ్ కరోలి బాబాపై గత పదేళ్లుగా ఆధ్యాత్మిక అనుబంధం ఉందని కూడా వెల్లడించారు. తాను చిన్నప్పటి నుంచి క్రికెట్‌ను ఎంతో ఇష్టపడేవాడినని, సెహ్వాగ్ రిటైర్ అయిన తర్వాత క్రికెట్ చూడటం కూడా ఆపేశానని విశాల్ చతుర్వేది తెలిపారు. అలాంటి తన అభిమాన క్రికెటర్ స్వయంగా తన సినిమాను చూసి ప్రశంసించడం తనకు జీవితంలో ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పారు.

ఇక క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ‘హనుమాన్ అంశ్’ సినిమాను చూసి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. తాను గత పదేళ్లుగా నీమ్ కరోలి బాబా కి అచంచలమైన భక్తుడినని పేర్కొన్న సెహ్వాగ్, బాబా జీవితాన్ని ఒకే సినిమాలో పూర్తిగా చూపించడం అసాధ్యం అయినప్పటికీ, ఈ మూవీని చాలా అద్భుతంగా మలిచారని కొనియాడారు. ఈ సినిమా గురించి మాట్లాడటానికి మాటలు సరిపోవడం లేదని ఎమోషనల్ అయ్యారు. సెహ్వాగ్ స్వచ్ఛందంగా తన పిల్లలతో కలిసి ఈ సినిమా చూసి రివ్యూ ఇవ్వడంపై దర్శకుడు విశాల్ చతుర్వేది కూడా ఎమోషనల్ గా స్పందించారు. అయితే ఇప్పుడు దర్శకుడి కోరిక మరో క్రికెట్ స్టార్‌పై ఉంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూడా ‘హనుమాన్ అంశ్’ను చూడాలని ఆయన కోరుకుంటున్నారు. నీమ్ కరోలి బాబా ఆశ్రమం ఉన్న కైంచీ ధామ్‌కు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వెళ్లిన విషయం కూడా తాజా రిపోర్టుల్లో ప్రస్తావనకు వచ్చింది. అందుకే ఈ ఆధ్యాత్మిక కథను వారిద్దరూ కూడా చూస్తే తమకు ఎంతో ఆనందంగా ఉంటుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక ‘హనుమాన్ అంశ్’ ప్రయాణం ఇక్కడితో ఆగడం లేదు. భారత్‌లో ఊహించని విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. హోంబలే ఫిల్మ్స్ ఓవర్సీస్ మార్కెట్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 2026 సెప్టెంబర్ 11 నుంచి విదేశాల్లో కూడా ‘హనుమాన్ అంశ్’ థియేట్రికల్ రిలీజ్ కానుంది. అంతేకాదు ఈ కథకు సీక్వెల్ కూడా ఉండబోతోతున్నట్లు తెలుస్తోంది.ఒక చిన్న సినిమాగా మొదలై మౌత్ టాక్‌తో భారీ విజయాన్ని అందుకోవడం, సెహ్వాగ్ వంటి దిగ్గజ క్రికెటర్ ప్రశంసలు అందుకోవడం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం కావడం ‘హనుమాన్ అంశ్’ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చేశాయి. మరి దర్శకుడు కోరుకున్నట్టుగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఈ సినిమాను చూస్తారా? చూసిన తర్వాత వారి స్పందన ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఈ ప్రశ్నలు కూడా సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ ను పెంచుతున్నాయి.