
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో.. బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ తరహాలోనే కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ప్రమాదమే తప్పింది. చిగురుమామిడి మండలం సుందరగిరిలో స్టీరింగ్ రాడ్ విరగడంతో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు బావిలో పడబోయి అంచున ఆగిన సంగతి తెలిసిందే. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం 50 మంది ప్రయాణికులతో హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తోంది.
కొత్తపల్లి ఫోర్ లేన్ రోడ్డు పనుల జరుగుతుండడంతో సుందరగిరి వద్ద బస్సు ఒక్కసారిగా ఎగిరిపడడంతో స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న కావటి బక్కయ్యకు చెందిన వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది. బావి అంచుకు వెళ్లాక ముందు టైర్ బావిలోకి వేలాడుతూ బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.