Reading Time: < 1 minute

పదవి పోయినంక పొలం పనుల్లో బిజీబిజీగా మాజీ మంత్రి చిన్నారెడ్డి !

Caption of Image.

వనపర్తి: వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం జయన్న తిరుమలాపూర్లో మాజీ మంత్రి చిన్నారెడ్డి పొలం పనుల్లో నిమగ్నమై కనిపించారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తనను తొలగించడంపై మాజీ మంత్రి చిన్నారెడ్డి స్పందించారు. తనకు  పదవి వ్యామోహం లేదని, చిన్నారెడ్డిగా తనకు ఉండే గుర్తింపు ఉందని ఆయన చెప్పారు. సస్పెన్షన్పై ఇప్పుడేమీ స్పందించనని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డికి ప్రభుత్వం ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు సీఎంవో ప్రకటించింది. చిన్నారెడ్డి స్థానంలో గద్వాల విజయలక్ష్మిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిలో నియమించింది. వనపర్తి నియోజకవర్గంలోని గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట సభలో స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై, పార్టీ హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చిన్నారెడ్డి పలు ఆరోపణలు చేయడంతో ఆయనపై వేటు పడింది.

వనపర్తి నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అన్నీ చూస్తూ భరిస్తున్నానని.. లేకపోతే జీవన్ రెడ్డిలా ఎప్పుడో పార్టీ మారేవాడినంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. అధిష్టానం తనకు టికెట్ ఇవ్వమని చెప్పినా.. రాష్ట్రంలో అడ్డుకున్నారని.. కాంగ్రెస్ పార్టీని స్వార్థంతో కూలగొట్టటానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.

కొంత మంది డబ్బులకు ఆశపడి తనకు అన్యాయం చేస్తున్నారని.. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర నాయకత్వంతో పాటు అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల క్రమంలోనే ఆయనను ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

©️ VIL Media Pvt Ltd.