
మంచిర్యాల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి వివేక్ ఫైర్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ఒక ఫెయిల్డ్ లీడర్ అని.. అతడి అసమర్థత వల్లే బీఆర్ఎస్ అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యిందన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలన అవినీతిమయమని విమర్శించారు. శుక్రవారం (సెప్టెంబర్ 4) మంత్రి వివేక్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని.. అందరం కలిసికట్టుగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దుబారా ఖర్చులతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు.
20 వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం ఉన్న కాళేశ్వరం రీ డిజైన్ పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశాడని కేసీఆర్‌పై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ చేసిన అప్పులకు రెండేళ్లలో రూ.3 లక్షల కోట్ల మిత్తి కట్టామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడమే TOMCOM లక్ష్యమన్నారు. జర్మనీ భాషపై పట్టు సాధిస్తూ స్కిల్స్ ఉన్న యువతకు 25 లక్షల వేతనాలు ఇప్పించే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ వాళ్ళ హయంలోనే కూలిపోయిందని ఎద్దేవా చేశారు.
►ALSO READ | సెప్టెంబర్ 6న BRSLP మీటింగ్.. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో KCR అధ్యక్షతన భేటీ
కాంగ్రెస్ కట్టిన ఒక్క ప్రాజెక్ట్ కూడా కుంగలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని.. జపాన్, కొరియాలో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో ఉండవన్నారు. ఎల్ నినో పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
రాష్ట్రంలో కేసీఆర్ తుగ్లక్ పాలన కొనసాగించారని విమర్శించారు. పది ఏండ్లలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు లక్షల ఇండ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు. గుడిసెలు, పెంకుటిల్లు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.