Reading Time: 2 minutes
Otr Ntv Telugu Telagana Trs Brs Political News

OTR: గత ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి సైలెంట్‌ అయిన ఆ మాజీ ఎమ్మెల్యే… ఇప్పుడు మళ్లీ యాక్టివ్‌ అవుతున్నారట. సైలెంట్‌ మోడ్‌ నుంచి బయటకు వచ్చేసి అగ్రెసివ్‌గా పనిచేసుకుంటున్నారట. ఓటమి తర్వాత నియోజకవర్గానికి ముఖం చాటేసిన ఆయన… ఇప్పుడు అధికార పార్టీపై పోరాటాలు చేస్తున్నారట. ఆ మాజీ ఎమ్మెల్యే ఒక్కసారిగా అగ్రెసివ్‌గా మారడానికి కారణమేంటి..? ఇంతలోనే అంత మార్పు ఎలా అనే చర్చ ఆ నియోజకవర్గంలో బాగా జరుగుతోందట. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే షకీల్‌. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గానికి రావడమే కరువైంది. పైగా కొడుకు యాక్సిడెంట్‌ కేసు, సీఎంఆర్‌ రైస్‌ కేసులు వెంటాడాయి. దీంతో చాలా రోజులు దుబాయ్‌లోనే ఉండిపోయారు షకీల్‌. ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్‌ అయిన షకీల్‌… 30 నెలలుగా నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు. దుబాయ్‌లో ఉంటూ వ్యాపారులు చూసుకుంటున్నారని అనుచరులు చెప్పేవారు. ఆ సమయంలో భార్య ఆయేషా ఫాతిమాను రాజకీయాల్లో బాగా ఎంకరేజ్‌ చేశారు. దీంతో షకీల్‌పై నియోజకవర్గ బీఆర్ఎస్‌ కార్యకర్తల్లో బాగా అసంతృప్తి పేరుకుపోయిందట.

నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు నాయకుడంటూ లేకుండా పోయారు. పార్టీ బలంగా ఉన్నా మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న విషయాన్ని స్థానిక నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారట. మరికొందరు నేతలైతే ఏకంగా ఓ అడుగు ముందుకుసి తమకో అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టారట. ఈ పరిస్థితుల్లో ఏం జరిగిందో కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా షకీల్‌ మళ్లీ యాక్టివ్‌ అయ్యారట. అయితే అందుకు కారణాలే వేరే ఉన్నాయనే చర్చ స్థానికంగా బీఆర్ఎస్‌ నేతల్లో జరుగుతోంది. షకీల్‌ మళ్లీ యాక్టివ్‌ కావడానికి బోధన్‌ నియోజకవర్గ కోడలు కారణమట. ఆమె ఎవరో కాదు కల్వకుంట్ల కవిత. కవిత అత్తగారి ఊరు బోధన్‌ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది. తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ పెట్టిన కవిత… బోధన్‌ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్‌ నేతలను లాగే పనిలో ఉన్నారట. బీఆర్ఎస్‌ నుంచి టీఆర్ఎస్‌లోకి రావాలని ఆహ్వానిస్తున్నారట. చాలామందితో టచ్‌లోకి వెళ్లారట. నియోజకవర్గ బీఆర్ఎస్‌లోని బలమైన నేతలతో కవిత టచ్‌లో ఉన్న విషయాలు చెవినపడటంతో మాజీ ఎమ్మెల్యే అలర్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

ఉన్న ఫలంగా షకీల్‌ దుబాయ్ నుంచి బోధన్ వచ్చారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై నిరసన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సభలో కవిత… బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే అవినీతిపరుడు అంటూ ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. ఆరోపణలకు కౌంటర్‌గా కవిత బోధన్‌ నుంచి పోటీ చేస్తే స్వాగతిస్తానంటూ ప్రకటించారట. కవిత బోధన్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. బోధన్‌ నియోజకవర్గాన్ని కవిత తన బేస్‌గా చేసుకుంటారనే ప్రచారంతో షకీల్ అప్రమత్తమై మళ్ళీ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. దీనికి తోడు ఇటీవల కేటీఆర్ సైతం మాజీ ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో ఉంటేనే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్పారట. దీంతో షకీల్ మళ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టి పార్టీ యాక్టివిటీ పెంచారట. కవిత ఎఫెక్ట్, కేటీఆర్ వార్నింగ్. కారణం ఏదైనా షకీల్ యాక్టివ్ కావడం బోధన్‌ గులాబీ శ్రేణుల్లో జోష్‌ వచ్చిందట.