
హైదరాబాద్: కొడంగల్ నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై శుక్రవారం (సెప్టెంబర్ 4) అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సమీక్ష సమావేశంలో సూచనలకు అనుగుణంగా మక్తల్- నారాయణపేట్- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి పంప్ హౌస్ పనులు ముందుకు తీసుకెళ్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు ప్రతీ సంవత్సరానికి అవసరమైన బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. అలాగే, ఫేజ్-2 పనులకు వీలయినంత త్వరగా టెండర్లు పిలవాలని సూచించారు.
►ALSO READ | నాణ్యత ముఖ్యం, వర్షపు నీరు వృధా కావొద్దు: హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్‌లో CM రేవంత్ క్షేత్రస్థాయి పరిశీలన
ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు వెళ్లేందుకు అవసరమైన నిధులపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలని చెప్పారు. భూసేకరణ, టెండర్లు, నిర్మాణ పనులను సమన్వయంతో చేపట్టి నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫేజ్-1 పనులను డిసెంబర్ 2027 నాటికి, ఫేజ్-2 పనులను అక్టోబర్ 2028 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.