Reading Time: < 1 minute
Ap Utf Hunger Strike Over Special Tet For In Service Teachers In Vijayawada

AP UTF Hunger Strike: ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు నిర్వహించనున్న ప్రత్యేక టెట్‌ పరీక్షను వ్యతిరేకిస్తూ ఏపీ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష ఈరోజు ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ధర్నాచౌక్‌లో ఈ దీక్షను ప్రారంభించనున్నట్లు ఉపాధ్యాయ సంఘం నేతలు వెల్లడించారు. ఇన్‌సర్వీస్‌ టీచర్లకు స్పెషల్ టెట్‌ నిర్వహణ విషయంలో ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము బోధిస్తున్న సబ్జెక్టులోనే ఎక్కువ మార్కులకు ప్రాధాన్యత ఉండేలా టెట్‌ పరీక్ష విధానంలో మార్పులు చేయాలని వారు కోరుతున్నారు.

టెట్‌లో అర్హత సాధించేందుకు అవసరమైన శాతాన్ని తగ్గించాలని, అలాగే ఉపాధ్యాయుల సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ యూటీఎఫ్‌ డిమాండ్ చేస్తోంది. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే.. నిరవధిక నిరాహార దీక్షను మరింత తీవ్రతరం చేసి, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉండగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్పెషల్ టెట్‌ అంశం చర్చకు వస్తుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించే తీరుపై తమ తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.