
హైదరాబాద్, వెలుగు: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం దర్గాఖలీసాఖాన్ గ్రామ పరిధిలో చేపట్టిన భూసేకరణలో పిటిషనర్లను భూముల నుంచి ఖాళీ చేయించొద్దని హైకోర్టు ఆదేశించింది. భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జస్టిస్ కె. శరత్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి, న్యాయవాది కె. ప్రతీక్ రెడ్డి, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. దర్గాఖలీసాఖాన్‌లో తమకు చెందిన 9.08 ఎకరాలను మూసీ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు.
భూసేకరణ చట్ట నిబంధనలు పాటించలేదని, సామాజిక ప్రభావ అధ్యయనం నిర్వహించలేదని, తమ అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించలేదని వాదించారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను అందుబాటులో ఉంచకుండా భూసేకరణ ప్రక్రియ కొనసాగించారని, సెక్షన్ 10ఏ కింద మినహాయింపు చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. 2004లో ఇదే భూముల సేకరణకు ప్రయత్నించగా ప్రజాప్రయోజనం స్పష్టంగా లేదన్న కారణంతో 2014లో హైకోర్టు రద్దు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తరఫున చట్ట ప్రకారమే ప్రక్రియ జరుగుతోందని, నిబంధనలు పూర్తయిన తర్వాతే భూములు స్వాధీనం చేసుకుంటామని ఏఏజీ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణ వరకు పిటిషనర్లను ఖాళీ చేయించొద్దని స్పష్టం చేశారు.