
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి సవాల్ విసిరారు. కేసీఆర్ ఈ అసెంబ్లీ సెషన్స్‌కు రావాలని.. ప్రజలకు అన్యాయం ఎవరూ చేస్తున్నారో అక్కడే తేల్చుకుందామని చాలెంజ్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా మొఖం చాటేస్తున్న కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్‌లో కాంగ్రెస్ శ్రేణులు శనివారం (సెప్టెంబర్ 5) భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి వివేక్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. చివరకు తనను గెలిపించిన గజ్వేల్ ప్రజల సమస్యలను తీర్చడానికి కూడా అందుబాటులోనే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీకి కూడా రావడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఆరు లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం మిత్తిలు చెల్లింస్తుందని తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం.. ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కావాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ రెండున్నరేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చిద్దామన్నారు.