
- కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
- ఐదుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు
- జిల్లాల్లో స్థలాలు గుర్తించాలని అధికారులను ఆదేశించిన మంత్రి పొన్నం
- 326 స్కూల్స్‌కు 25 చోట్లే సొంత బిల్డింగ్స్
- బడ్జెట్‌లో రూ.500 కోట్ల కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని స్కూళ్లకు సొంత బిల్డింగ్స్ నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో కొత్త బిల్డింగ్స్ నిర్మాణానికి స్థలాలు గుర్తించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు ఐదుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. కమిటీ సభ్యులు జిల్లాల్లో పర్యటిస్తూ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఒక్కో ఆఫీసర్‌కు ఐదు లేదా ఆరు జిల్లాల బాధ్యతలు అప్పగించనున్నారు. వీళ్లు అన్ని జిల్లాల్లో పర్యటించి స్థలాలు గుర్తించి ఫైనల్ చేయనున్నారు. ఈ నెలాఖరుకల్లా జిల్లాల పర్యటనలు పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వాలని బీసీ గురుకుల సొసైటీ అధికారులను మంత్రి ఆదేశించారు.
326 స్కూళ్లకు 25 చోట్ల సొంత బిల్డింగ్స్..
రాష్ట్రంలో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 326 స్కూళ్లు ఉన్నాయి. ఇందులో సుమారు లక్షా అరవై వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. కేవలం 25 చోట్ల మాత్రమే సొంత బిల్డింగ్స్ ఉన్నాయి. 119 నియోజకవర్గాలు ఉండగా, ఇందులో 90 నియోజకవర్గాల్లో సొంత బిల్డింగ్స్ లేవు. మిగతావన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో స్కూల్, హాస్టల్, ఉద్యోగులు, సిబ్బంది క్వార్టర్స్‌కు 5 నుంచి 10 ఎకరాల్లో (సుమారు 60 వేల ఎస్ఎఫ్‌టీ నుంచి లక్ష ఎస్ఎఫ్‌టీ విస్తీర్ణం ఉన్న భవనాలు) సుమారు రూ.30 కోట్లు అంచనా వ్యయం అవసరమవుతుందని బీసీ గురుకుల సొసైటీ అధికారులు అంచనా వేశారు.
ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో సొంత భవనాల నిర్మాణం కోసం రూ.500 కోట్లు కేటాయించారు. ఒక్కో స్కూల్‌లో 5 నుంచి 10వ తరగతి వరకు సుమారు 600 నుంచి 800 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ప్రస్తుతం 38 నియోజకవర్గాల్లో సొంత భవనాల నిర్మాణానికి ల్యాండ్ గుర్తించారు. వీటిని గురుకుల సొసైటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో 52 నియోజకవర్గాల్లో స్థలాలను గుర్తించాల్సి ఉంది.
ఏటా అద్దె భారం రూ.120 కోట్లు..
బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ప్రస్తుతం 300 స్కూళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రైవేట్ భవనాలు, మూసేసిన ఇంజినీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్‌లో ఇవి నడుస్తున్నాయి. వీటికి ఏటా రూ.120 కోట్లు అద్దెల రూపంలో ప్రైవేట్ వ్యక్తులకు చెల్లిస్తోంది. బకాయిలు నాలుగైదు నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తుండటంతో ఏటా అద్దె భవనాల ఓనర్లు ధర్నాలు చేస్తుండటం, ఆ భవనాలకు తాళాలు వేసి నిరసన తెలుపుతున్నారు. మంత్రులు జోక్యం చేసుకొని వాళ్లతో చర్చలు జరిపి అద్దె బకాయిలు రిలీజ్ చేయించడంతో వివాదం సద్దుమణుగుతోంది.