Reading Time: 2 minutes

E20 పెట్రోల్‌తో భయపడాల్సిన పనిలేదు.. వాహనాలకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు : FADA అధ్యక్షుడు..

Caption of Image.

వాహనాల్లో E20 పెట్రోల్ వాడకంపై వాహనదారుల్లో ఉన్న ఆందోళనలను ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) అధ్యక్షుడు సాయి గిరిధర్ స్పష్టం చేశారు. E20 పెట్రోల్ వల్ల వాహనాలకు ఎలాంటి హానీ జరగదని, భయపడాల్సిన అవసరం లేదని  తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 8వ ఆటో రిటైల్ కాంక్లేవ్‌లో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

 E20 పెట్రోల్ అంటే ఏంటి ? సేఫెనా ?  

E20 అంటే సాధారణ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి తయారు చేసే మిశ్రమ ఇంధనం. E20 పెట్రోల్ ఇప్పటికే మన దేశంలో ఎక్కువగా  అందుబాటులో ఉందనీ, ప్రభుత్వ పరిశోధనా సంస్థలు దీనిని పూర్తిగా పరీక్షించి ఆమోదించాయని ఆయన చెప్పారు. 2023 తర్వాత మార్కెట్లోకి వచ్చిన కార్లన్నీ E20 ఇంధనానికి అనుగుణంగానే తయారయ్యాయి. 10 నుంచి 15 ఏళ్ల నాటి పాత కార్లలో మాత్రమే మైలేజీ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది తప్ప, ఇంజన్‌కు ఎలాంటి సమస్య ఉండదు.

మొదట్లో E20 పెట్రోల్‌పై కస్టమర్లు అడిగిన ప్రశ్నలకు డీలర్లు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. అయితే ఇప్పుడు వాహన తయారీ కంపెనీలు (OEMs) డీలర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు (SOPs) అందించాయి. దీనివల్ల కస్టమర్ల అనుమానాలను సైంటిఫిక్ పద్ధతిలో నివృత్తి చేస్తున్నామని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన అమ్మకాలు

రాబోయే పండుగ సీజన్‌లో ఆటోమొబైల్ రంగానికి గ్రామీణ భారతమే కీలక ఆధారంగా మారనుందని గిరిధర్ అభిప్రాయపడ్డారు. పట్టణాల కంటే చిన్న పట్టణాలు, పల్లెల్లోనే కార్లు, బైక్‌ల డిమాండ్ బాగా పెరుగుతోంది. వడ్డీ రేట్ల తగ్గింపు, ప్రభుత్వ పన్ను సంస్కరణలు కూడా ఇందుకు దోహదపడ్డాయి.

2030 నాటికి ఈవీ లభ్యత
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకం వేగంగా పుంజుకుంటోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 2030 నాటికి దేశంలో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సులభంగా అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

డిజిటల్ విప్లవం & సేవలు

ఆటోమొబైల్ రంగంలో సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరుగుతోందని చెప్పారు. డీలర్లకు సులభ వ్యాపారం కోసం  పేపర్‌లెస్ వెహికల్ రిజిస్ట్రేషన్, సెకండ్ హ్యాండ్ వాహనాల ట్రాన్స్‌ఫర్ ప్రక్రియలను మరింత సరళతరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
 

©️ VIL Media Pvt Ltd.