
Supreme Court: ప్రభుత్వ పాఠశాలల్లో బయటి వ్యక్తులు, జర్నలిస్టులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ప్రతినిధులు, సివిల్ సొసైటీ కార్యకర్తల ప్రవేశంపై ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. అయితే, ఈ ఆంక్షల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారించేందుకు నిరాకరించింది. పాఠశాలల్లో ఫోటోలు, వీడియోలు, ఇంటర్వ్యూలు, లైవ్ స్ట్రీమింగ్ పైన అనుమతి తీసుకోవాలని ప్రభుత్వాలు ముందస్తు నిబంధనల్ని విధించడంపై పిటిషనర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ప్రియా మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలైన ఈ రిట్ పిటిషన్‌ను విచారించేందుకు తాము ఆసక్తిగా లేమని ధర్మాసనం పేర్కొంది. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలు స్కూళ్లను పరిశీలించే ముందు ప్రిన్సిపాల్ అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి.
అయితే, ఈ ఆంక్షలు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19(1)(a), 19(1)(g), 21, 21-A ద్వారా హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ వాదించారు. ప్రజా సంస్థల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం, చట్టబద్ధమైన జర్నలిజం కూడా భావ వ్యక్తీకరణలో భాగమే అని ప్రియా మిశ్రా వాదించారు. అయితే, అదే సమయంలో పిల్లల గోప్యత, గౌరవం, భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి భారీ షాక్‌గా చెప్పొచ్చు. సీజేపీ ‘‘స్కూల్ ఠీక్ కరో’’ కార్యక్రమం పేరుతో మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూళ్లను తనిఖీలు చేస్తోంది. పాఠశాలను బాగు చేయాలనే పేరుతో సీజేపీ నేతలు పాఠశాలలోకి అనుమతి లేకుండా ప్రవేశించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు బయట వ్యక్తులు స్కూళ్లలోకి వెళ్లకుండా ప్రభుత్వ ఆదేశాలకు మద్దతు ఇచ్చింది.