
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు ఈ నెల 6న జరగనున్న నేపథ్యంలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. నిర్మాతల సంక్షేమం, పారదర్శకత, సమాన హక్కులు, కొత్త నిర్మాతలకు ప్రోత్సాహం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్యానెల్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ‘ప్రతి అర్హత కలిగిన సభ్యుడికి రూ.5 లక్షల క్యాష్‌లెస్ వైద్య సదుపాయం కల్పిస్తాం. అలాగే అత్యవసర పరిస్థితుల్లో నిర్మాతలను ఆదుకునేందుకు రూ.50 లక్షల ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేస్తాం.
దాదాపు 300 మంది యాన్యువల్ మెంబర్స్‌ను వన్‌టైమ్ మినిమం ఫీజుతో రెగ్యులర్ మెంబర్స్‌గా మారుస్తాం. కొత్త నిర్మాతల కోసం సింగిల్ విండో హెల్ప్‌లైన్, గైడెన్స్ డెస్క్ ఏర్పాటు చేస్తాం. మహిళా భద్రతతో పాటు నిర్మాతల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. చిన్న నిర్మాతలకు అండగా నిలుస్తామని, సినిమాల విడుదలకు అవసరమైన సూచనలు, గైడెన్స్ అందిస్తామని నిర్మాత రవిశంకర్ తెలిపారు. పారదర్శకత, నిజాయితీ, నమ్మకం, సమాన హక్కులు తమ ప్యానెల్ ప్రధాన లక్ష్యాలని నిర్మాత అశోక్ కుమార్ అన్నారు. నిర్మాతలందరికీ సమాన ప్రాధాన్యత కల్పించే పారదర్శకమైన కౌన్సిల్‌ను నిర్మించడమే తమ లక్ష్యమని ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు స్పష్టం చేశారు.